Iran US War : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తం..కువైట్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరుపక్షాలు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో శాంతి చర్చల ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో పడింది.

New Update
FotoJet (100)

Iran fires missiles at Kuwait

Iran US War : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన కీలకమైన రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేయగా.. ప్రతికారంగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్షిపణి, డ్రోన్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా విజయవంతంగా అడ్డుకున్నామని అటు అమెరికా, ఇటు కువైట్ ప్రకటించాయి. అయితే, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇరుపక్షాలు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో శాంతి చర్చల ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో పడింది.

అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న తమ ఎంక్యూ-1 (MQ-1) నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడానికి నిరసనగా తాము ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని గెరుక్, ఖెష్మ్ ద్వీపాల్లో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లతో పాటు దాడులకు సిద్ధంగా ఉన్న రెండు డ్రోన్లపై అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల వల్ల తమ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందని ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను విడుదల చేస్తూ.. ‘ఈ ప్రాంతం నుండి చివరి అమెరికా సైనికుడు వెళ్లేవరకు పోరాటం సాగుతుంది’ అని హెచ్చరించింది. ఆ వీడియోలో ప్రదర్శించిన క్షిపణిపై మూసివేసిన హర్మూజ్ జలసంధి చిత్రంతో పాటు గాయపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోను ఉంచడం గమనార్హం.

ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ రవాణా నౌకలపై కూడా పడింది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని దాటుకుని వచ్చిన 'ఉమ్ ఖజర్' అనే గాంబియా రవాణా నౌక ఇంజిన్‌పై అమెరికా క్షిపణి దాడి చేయడంతో ఇరాక్ సరిహద్దు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. అమెరికా తరచూ తన వైఖరిని మార్చుకుంటోందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఉద్రిక్తతల మధ్యే హర్మూజ్ జలసంధి ద్వారా గత మూడు వారాల్లో తాము 70 నౌకలను సురక్షితంగా పంపించామని అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఇరాన్ కూడా అమెరికాతో ఒప్పందాన్ని కోరుకుంటోందని, ఇది అందరికీ మంచిదని అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఉదయం ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.

మరో ప్రధాన రంగంలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించగా, ప్రతిగా హెజ్బొల్లా సంస్ధ ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడింది. బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో వేలమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపకపోతే అమెరికాతో జరుగుతున్న పరోక్ష శాంతి చర్చలను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యవసరంగా మాట్లాడటంతో, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి తన తదుపరి దాడుల ప్రణాళికను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం ఇరాన్ ముమ్మర దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో అత్యవసర చర్చలు జరిపి, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు ఇజ్రాయెల్ చేస్తున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను అడ్డుకోవడానికి సహకరించాలని కోరారు. అయితే, ఇరాన్ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా స్పందించారు. లెబనాన్ దాడుల నెపంతో ఇరాన్ చర్చల నుంచి వైదొలిగినా తనకు వచ్చే నష్టమేమీ లేదని తేల్చిచెప్పారు. ఈ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళన తనకు లేదని, సమీప భవిష్యత్తులోనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కుప్పకూలిపోతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరుపక్షాలకు జరిగిన నష్ట తీవ్రతను ఉపగ్రహ (శాటిలైట్) చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, ఒమన్ వంటి వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికాకు చెందిన సుమారు 20 సైనిక స్థావరాలను ఇరాన్ తన దాడుల ద్వారా పూర్తిగా ధ్వంసం చేసింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య 28 వరకు ఉండవచ్చని తెలుస్తోంది, దీనివల్ల అమెరికాకు కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. దీనికి ప్రతిగా తాము ఇరాన్‌కు చెందిన 13,000 సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలపై విజయవంతంగా దాడులు చేసి నిర్వీర్యం చేశామని అమెరికా సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఒకరినొకరు దెబ్బతీసుకునే ఈ చర్యల వల్ల పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు