/rtv/media/media_files/2026/06/08/dubai-2026-06-08-18-39-43.jpg)
గల్ఫ్ దేశాల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ETCA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2026 జూన్ 7 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అజ్మాన్ లోని హ్యాబిటెట్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది గల్ఫ్ తెలంగాణ వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ అస్థిత్వ వేదిక చైర్మన్, ప్రముఖ ఉద్యమ నాయకులు వి.ప్రకాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను అందరూ కలిసి ఆలపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి, తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులు అర్పించారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇది కేవలం ఒక రోజు పండుగ కాదని, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేరిన చారిత్రాత్మక రోజు అని కొనియాడారు.
చరిత్రలో చిరస్థాయిగా
తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన 1569 మంది అమరవీరుల త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత రూపం ఇచ్చి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే, అకుంఠిత దీక్షతో, అలుపెరుగని పోరాటంతో మలిదశ ప్రజా ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి రాష్ట్ర కలని నిజం చేసిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని, శ్రమను కిరణ్ కుమార్ భావోద్వేగంగా కొనియాడారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, రైతులు, మహిళలు, జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా నౌక గద్దర్, కవులు అందెశ్రీ, గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డిల కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అడుగులు పడటం, అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ఇదే సమయంలో గల్ఫ్ వలసదారులు, ఎన్నారైల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రూ. 5 లక్షల మృతధన పరిహారాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి (2014) నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో మరణించిన పేద కార్మికుల కుటుంబాలకు కూడా వర్తింపజేసి, వారిని ఆదుకోవాలని కోరారు.
ముఖ్య అతిథి వి.ప్రకాష్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో కంటే విదేశాల్లోనే తెలంగాణ పండుగలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాల వల్లే విదేశాల్లో పెరుగుతున్న మన పిల్లలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, సాంస్కృతిక వైభవం తెలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. 2011 నుండి ETCA చేస్తున్న సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల ఆడియో విజువల్ ప్రదర్శనను చూసి సభ్యుల పనితీరును ఆయన ఎంతగానో అభినందించారు. ఈ వేడుకల్లో చిన్నారులు తెలంగాణ ప్రముఖుల వేషధారణలతో, నృత్యాలతో ఆకట్టుకున్నారు. మహిళా విభాగం సభ్యులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద్-విపుల దంపతుల కామెడీ స్కిట్, ప్రముఖ గాయకుడు మల్లేష్ కోరేపు పాడిన తెలంగాణ పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో ETCA ప్రతినిధులు రాధారపు సత్యం, శ్రీనివాస్ అలిగేటి, శేఖర్ గౌడ్, తిరుమల్ రావు, వినోద్ కుమార్, సాయి చందర్, వెంకటేశ్వర్ రావు, మధుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, సంతోష్ కుమార్, రాము జల, రాము కందుకూరి, రఘు అలిగేటి, రమణ స్వర్గం, సారిక, మౌనికతో పాటు వివిధ గల్ఫ్ తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు రాజ శ్రీనివాస్ రావు, మస్సియోద్దీన్, గుండెల్లి నర్సింహా, రవి కటుకం, ఎస్వీఎస్ రెడ్డి, రమేష్, జితేంధర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/1-2026-06-08-18-22-58.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/2-2026-06-08-18-24-01.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/3-2026-06-08-18-24-16.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/4-2026-06-08-18-26-37.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/5-2026-06-08-18-27-22.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/6-2026-06-08-18-27-52.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/7-2026-06-08-18-28-26.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/8-2026-06-08-18-28-53.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/9-2026-06-08-18-29-22.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/10-2026-06-08-18-29-56.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/11-2026-06-08-18-30-27.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/12-2026-06-08-18-31-05.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/13-2026-06-08-18-31-39.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/14-2026-06-08-18-32-14.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/15-2026-06-08-18-32-51.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/16-2026-06-08-18-33-35.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/08/17-2026-06-08-18-37-36.jpg)
Follow Us