Crime News : ఇటలీలో కాల్పులు..ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బెర్గామో  ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి. వైశాఖీ పండుగ వేడుకల కోసం అక్కడి గురుద్వారా కి వెళ్ళిన వారిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

New Update
gun fire

gun fire

 Crime News : ఇటలీలో ఇద్దరు భారతీయులు దుండగుడి తూటాలకు బలయ్యారు. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలోని బెర్గామో  ప్రావిన్స్‌లో ఉన్న కోవో అనే పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వైశాఖీ పండుగ వేడుకల కోసం అక్కడి స్థానిక గురుద్వారా (మాతా సాహిబ్ కౌర్ జీ) కి వెళ్ళిన ఇద్దరు భారతీయులు, వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మరణించిన వారిని 48 ఏళ్ల రజిందర్ సింగ్, 48 ఏళ్ల గుర్మీత్ సింగ్‌గా గుర్తించారు. వీరిలో రజిందర్ సింగ్ కోవో పట్టణ నివాసి కాగా, గుర్మీత్ సింగ్ సమీపంలోని అగ్నాడెల్లోలో నివసిస్తున్నారు. గుర్మీత్ సింగ్‌కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.గురుద్వారా సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ఓపెన్ స్పేస్‌లో ఈ దాడి జరిగింది. దుండగుడు సుమారు 10 రౌండ్ల కాల్పులు జరిపి, కారులో పారిపోయాడు. ఇది అకస్మాత్తుగా జరిగిన గొడవ కాదని, ముందుగానే ప్లాన్ చేసి జరిపిన "కోల్డ్-బ్లడెడ్ ఎగ్జిక్యూషన్" (పథకం ప్రకారం చేసిన హత్య) అని పోలీసులు అనుమానిస్తున్నారు.

  ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నిందితుడు కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చని, అతను కూడా తరచుగా ఆ గురుద్వారాకు వస్తుంటాడని తెలుస్తోంది.ఈ ఘటనలో మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక అధికారులు, భారత రాయబార కార్యాలయం ఈ విషయంపై స్పందిస్తూ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.  కోవో మేయర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా అక్కడ ఉన్న సిక్కు కమ్యూనిటీ ఎంతో శాంతియుతంగా ఉంటుందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.పోలీసులు ప్రస్తుతం సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పావియా (Pavia) కు తరలించారు. ఈ హత్యకు గల కారణాలు వ్యక్తిగత కక్షలా లేక ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.వైశాఖీ పండుగ వేడుకల సమయంలో ఇలాంటి విషాదం జరగడంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisment
తాజా కథనాలు