/rtv/media/media_files/2026/04/26/ugravadi-2026-04-26-20-06-47.jpg)
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అఫ్రిదీ లక్ష్యంగా దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారని, తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడికక్కడే మట్టుబెట్టారని ప్రాథమిక సమాచారం అందుతోంది. హత్య చేసిన అనంతరం హంతకులు ఘటనా స్థలం నుండి పరారయ్యారు.
ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా
షేక్ యూసుఫ్ అఫ్రిదీ సుదీర్ఘకాలంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, లష్కరే తోయిబా సంస్థలో అతను కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించేవాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల సమాచారం అందిన వెంటనే పాక్ భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, హంతకులు ఎవరు? ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు.
ప్రస్తుతం పాకిస్థాన్ భద్రతా సంస్థలు దీనిని 'టార్గెట్ కిల్లింగ్' కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద కమాండర్లు వరుసగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతుండటం గమనార్హం. హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తుడైన అఫ్రిదీ మరణం లష్కరే తోయిబాకు తీరని లోటని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Follow Us