Saudi Arabia : తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం : ఇరాన్ ఫార్ములాతోనే కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న సౌదీ!

ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.

New Update
saudo

ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ స్టార్టప్ సంస్థ సాయంతో సౌదీ అరేబియా ఒక భారీ డ్రోన్ల తయారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులను తిప్పికొట్టేందుకు, అలాగే తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు సౌదీ ఈ అడుగు వేసింది.

అమెరికాకు చెందిన వెక్టార్ డిఫెన్స్,  సౌదీకి చెందిన ఎస్ఆర్2 డిఫెన్స్ సిస్టమ్స్ అనే రెండు సంస్థలు చేతులు కలిపి ఎస్ఆర్2 వెక్టార్ అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. సౌదీ రాజధాని రియాద్‌కు సమీపంలో నిర్మించబోయే సరికొత్త ప్లాంట్‌లో స్కైవాస్ప్ అనే పేరుతో లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్లను తయారు చేయనున్నారు. ఇవి ఇరాన్ వాడుతున్న షాహెద్ డ్రోన్ల తరహాలోనే శత్రు స్థావరాలపై వన్-వే స్ట్రైక్ చేసేలా రూపొందించబడుతున్నాయి.

ఈ స్కైవాస్ప్ డ్రోన్లు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షిపణి తరహాలో వెళ్లి ఢీకొట్టగలవు. అంటే, సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల నుండి నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ఇవి సులువుగా చేరుకోగలవన్నమాట. ఈ డ్రోన్ల తయారీ ద్వారా సౌదీ భద్రతా దళాల బలం అమాంతం పెరుగుతుందని, ఇరాన్‌కు గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందని ఎస్ఆర్2 డిఫెన్స్ సహ వ్యవస్థాపకుడు లూసియన్ జైగ్లర్ తెలిపారు. అయితే ఈ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, దీని కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అనే వివరాలను ఆయన గోప్యంగా ఉంచారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లను సౌదీతో పాటు తమ మిత్రదేశాలకు కూడా సరఫరా చేయనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుండి ఇరాన్ వైపు నుంచి జరిగిన డ్రోన్లు, మిస్సైల్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని కొన్ని హోటళ్లు, ఎనర్జీ ప్లాంట్లు, డేటా సెంటర్లు దెబ్బతిన్నాయి. ఇరాన్ తయారు చేసే షాహెద్ డ్రోన్ల ఖరీదు కేవలం 35 వేల డాలర్లు (దాదాపు రూ. 29 లక్షలు) మాత్రమే ఉంటుంది. కానీ, వాటిని కూల్చడానికి వాడే రక్షణ క్షిపణుల ఖరీదు మాత్రం చాలా రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందుకే శత్రువును దెబ్బతీయడానికి భారీ ఖర్చుతో కూడిన మిస్సైళ్ల కంటే.. ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ల వైపే గల్ఫ్ దేశాలు మొగ్గు చూపుతున్నాయి.

మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు

ప్రస్తుతం ప్రపంచంలోనే మిలిటరీ కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. అయితే ఇప్పటివరకు ఇతర దేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న సౌదీ.. 2030 నాటికి తమకు కావలసిన సగం సైనిక సామాగ్రిని సొంతంగానే తయారు చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అమెరికాతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ, ట్రంప్ ప్రభుత్వ మద్దతుతో ఈ సరికొత్త హైటెక్ డ్రోన్ల తయారీ కేంద్రానికి తెరలేపింది.

Advertisment
తాజా కథనాలు