/rtv/media/media_files/2026/06/10/belfast-anti-immigrant-riots-in-northern-ireland-2026-06-10-20-38-19.jpg)
Belfast anti-immigrant riots in Northern Ireland
Ireland: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలు నగరాన్ని అట్టుడికించాయి. ముసుగులు ధరించిన ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి కార్లు, ఇళ్లు, ఇతర ఆస్తులపై దాడులు చేశారు. అనేక వాహనాలకు నిప్పంటించడంతో భారీగా మంటలు చెలరేగగా, పలు ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా బలగాలు భారీగా మోహరించాల్సి వచ్చింది.
ఈ ఉద్రిక్తతలకు మూలం ఇటీవల చోటుచేసుకున్న కత్తిపోటు ఘటనగా భావిస్తున్నారు. సుడాన్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఒకరిపై కత్తితో దాడి చేయగా, బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోర్టులో సమర్పించిన వివరాల ప్రకారం, బాధితుడు ఒక కన్ను కోల్పోగా, ముఖం , వెన్నుపైన తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడైంది.
సోషల్ మీడియాలో హింసాత్మక నిరసనలకు పిలుపులు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చిన గుంపులు పలు ప్రాంతాల్లో పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు బస్సులు, వాహనాలు, నివాసాలపై దాడులకు దిగాయి. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోగా, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధుల ప్రకారం దాడులకు గురైన వారిలో ఎక్కువ మంది నల్లజాతీయులు, వలసదారులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలపై బ్రిటీన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా స్పందించారు. జాతి, మతం లేదా నేపథ్యం ఆధారంగా ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం సహించబోమని, హింసకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్‌లో వలస విధానాలు, ఆశ్రయం కోరుతున్న వారి ప్రవేశం, సామాజిక భద్రత వంటి అంశాలపై రాజకీయ చర్చలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో బెల్‌ఫాస్ట్‌లో చోటుచేసుకున్న తాజా హింసాత్మక ఘటనలు వలసదారుల భద్రత, సామాజిక సామరస్యం మరియు జాతి సంబంధాలపై మరోసారి ఆందోళనలను పెంచుతున్నాయి.
Follow Us