/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)
Trump
మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదురుతోంది. ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన మొండిపట్టు వీడకుంటే ఆ దేశాన్ని నాశనం చేసే వరకు విశ్రమించబోమని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదురుతుండటంతో, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హార్మూజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరాటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
హార్మూజ్ తెరిస్తేనే శాంతి.. లేదంటే భీకర దాడులు!
వైట్ హౌస్‌లో జాతినుద్దేశించి మీడియా ముందు ప్రసంగించిన ట్రంప్, ఇరాన్‌పై యుద్ధం విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. "హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచి, చమురు నౌకల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలి. అప్పుడే కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తాం. లేదంటే ఇరాన్ కోలుకోలేని విధంగా భీకర దాడులు తప్పవు" అని హెచ్చరించారు. ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలు రాకుండా యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
President Trump Delivers an Address to the Nation, Apr. 1, 2026 https://t.co/QgofMPWtzW
— The White House (@WhiteHouse) April 2, 2026
పెజెష్కియాన్ తెలివైన వారు.. కానీ!
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నుంచి తనకు శాంతి సందేశం అందిందని ట్రంప్ వెల్లడించడం గమనార్హం. గత అధ్యక్షుల కంటే పెజెష్కియాన్ తెలివైన వారని ప్రశంసిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో విజ్ఞప్తులతో పనవ్వదని, ఆచరణలో మార్పు ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
లొంగే ప్రసక్తే లేదన్న ఇరాన్
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దీటుగా స్పందించారు. అమెరికా బెదిరింపులకు తాము లొంగేదే లేదని స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమాధికారం కోసం చివరి వరకు పోరాటం చేస్తామని, బెదిరింపులతో చర్చలు సాధ్యం కావని ఆయన పేర్కొన్నారు.
Follow Us