/rtv/media/media_files/2026/03/24/philippines-2026-03-24-21-28-46.jpg)
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతుండటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ ఇంధన అత్యవసర స్థితి ప్రకటించారు.
ఇంధనం, ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల పంపిణీని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన నిల్వలను పెంచుకోవడానికి ప్రభుత్వం నేరుగా పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసే అధికారాన్ని పొందింది. అవసరమైతే విదేశీ సంస్థలకు ముందస్తు చెల్లింపులు చేసి మరీ సరఫరాను నిర్ధారించుకోనుంది.
వారానికి నాలుగు రోజులు మాత్రమే
గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో, తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు ఆధారిత ప్లాంట్లపై ఎక్కువగా ఆధారపడాలని నిర్ణయించారు. దీనివల్ల కరెంట్ ఛార్జీలు పెరగకుండా అదుపు చేయవచ్చని ఆ దేశ ఇంధన శాఖ కార్యదర్శి షారన్ గారిన్ తెలిపారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు అమలు చేస్తున్నారు. అలాగే ఫెర్రీ సర్వీసులను కూడా తగ్గించారు.
ఫిలిప్పీన్స్‌లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు యుద్ధం మొదలవ్వకముందు కంటే రెట్టింపు అయ్యాయి. దేశంలో కేవలం 45 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ఆసియా దేశాలకు వచ్చే 90% చమురు హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. ఇప్పుడు ఆ మార్గంలో ఆంక్షలు ఉండటంతో ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ముప్పు పెరిగింది.ప్రస్తుతానికి ఈ అత్యవసర స్థితి ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. పరిస్థితిని బట్టి దీనిని పొడిగించడం లేదా ఎత్తివేయడంపై అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు.
Follow Us