/rtv/media/media_files/2026/03/04/iran-israel-war-2026-03-04-21-22-27.jpg)
ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ను కూడా ఈ వివాదంలోకి లాగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అణుబాంబు కలిగిన ఏకైక ముస్లిం దేశం కావడంతో పాకిస్తాన్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం, ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఇస్లామాబాద్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ యుద్ధంలోకి ప్రవేశించే తర్వాతి దేశం పాకిస్తాన్.. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.
1. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం
పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య 2025లో ఒక కీలకమైన 'నాటో తరహా' (NATO-style) రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్‌పై జరిగిన దాడిగానే పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులు సౌదీలోని 'రాస్ తనూరా' వంటి చమురు కేంద్రాలను లక్ష్యం చేసుకుంటున్న నేపథ్యంలో, సౌదీ రక్షణ కోసం పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపాల్సి రావచ్చు.
2. అంతర్గత సెక్యులర్, మతపరమైన ఒత్తిడి
పాకిస్తాన్లో సుమారు 4 కోట్ల మంది షియా ముస్లింలు ఉన్నారు. అలీ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ వంటి నగరాల్లో భారీ నిరసనలు మిన్నంటాయి. ఇరాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతుండటంతో, ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
3. 'జియోనిస్ట్ కుట్ర' ఆరోపణలు
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ లక్ష్యం పాకిస్తానేనని, భారత్-అఫ్గానిస్తాన్-ఇజ్రాయెల్ కలిసి పాకిస్తాన్‌ను ఒక 'సామంత దేశం'గా మార్చాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ భయం పాకిస్తాన్‌ను ముందస్తుగా యుద్ధం వైపు నడిపించే అవకాశం ఉంది.
4. అఫ్గానిస్తాన్‌తో 'ఓపెన్ వార్'
ఒకవైపు ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తంగా ఉంటే, మరోవైపు అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ ఇప్పటికే 'బహిరంగ యుద్ధం' చేస్తోంది. ఇరాన్ గనుక అస్థిరతకు గురైతే, ఆ ప్రభావం పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ వేర్పాటువాదులపై పడుతుందని, ఇది దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుందని ఇస్లామాబాద్ భయపడుతోంది.
5. అణు ఆయుధాల ప్రస్తావన
ఇరాన్‌ను కాపాడటానికి పాకిస్తాన్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుందనే వార్తలను ఇస్లామాబాద్ ఖండించినప్పటికీ, ఇజ్రాయెల్ దూకుడు పెంచితే ముస్లిం దేశాల ఐక్యత పేరుతో పాకిస్తాన్ తన వ్యూహాన్ని మార్చుకోవచ్చు.
Follow Us