/rtv/media/media_files/2026/02/22/pakistan-2026-02-22-09-54-49.jpg)
పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఆకస్మిక వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా వేదికగా ఈ దాడులను వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాలు నంగర్హర్, పక్తికా ప్రాంతాల్లోని పౌర ఆవాసాలపై బాంబుల వర్షం కురిపించాయని ఆయన పేర్కొన్నారు. తమ దేశంలో భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాకిస్థాన్ జనరల్స్ ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ దాడుల్లో అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు బలైపోయారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
TTP స్థావరాలే లక్ష్యంగా
మరోవైపు, పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఈ దాడులను సమర్థించుకున్నారు. తమ దేశంలో పెరుగుతున్న ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్థానీ తాలిబన్' (TTP) స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఆయన తెలిపారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఏడు ఉగ్రవాద క్యాంపులపై సెలెక్టివ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు పాక్ పేర్కొంది. గత అక్టోబర్లో కూడా పాక్ సైన్యం ఆఫ్ఘన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఇలాంటి దాడులే చేయడం గమనార్హం.
తమ సార్వభౌమాధికారాన్ని పాకిస్థాన్ దారుణంగా ఉల్లంఘించిందని ఆఫ్ఘన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MOD) మండిపడింది. ఇది అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని స్పష్టం చేసింది. "దేశాన్ని, ప్రజలను కాపాడుకోవడం మా బాధ్యత. ఈ దాడులకు సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెబుతాం" అని ఆఫ్ఘన్ సైన్యం తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
మిలిటరీ టార్గెట్లు కాకుండా మతపరమైన కేంద్రాలు, జనావాసాలపై దాడులు చేయడం పాక్ సైన్యం యొక్క నిఘా వైఫల్యానికి నిదర్శనమని ఆఫ్ఘన్ ప్రతినిధులు ఎద్దేవా చేశారు. పాక్ అంతర్గత సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దాడులకు దిగుతోందని వారు ఆరోపించారు.
Follow Us