Pakistan : పాకిస్థాన్‌లో బతకడం ఘోరం..  లీటర్ డీజిల్ రూ. 520 బాసూ.. పెట్రోల్ ఎంతో తెలుసా?

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో, పాక్ ప్రభుత్వం సామాన్యులపై పెను భారాన్ని మోపింది.

New Update
petrol

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో, పాక్ ప్రభుత్వం సామాన్యులపై పెను భారాన్ని మోపింది. నెల రోజులు తిరగకముందే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ డీజిల్ ధర ఏకంగా 55 శాతం, పెట్రోల్ ధర 43 శాతం మేర పెరిగాయి.

తాజా పెంపుతో పాకిస్థాన్‌లో లీటర్ డీజిల్ ధర 520.35 రూపాయలకు (పాకిస్థానీ కరెన్సీ), పెట్రోల్ ధర 458.40 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అదుపు తప్పాయని, అందుకే ధరలు పెంచక తప్పలేదని ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ స్పష్టం చేశారు. గత నెలలో కూడా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలను అక్కడి ప్రభుత్వం 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే.

ప్రజలపై మరింత ఒత్తిడి

ఈ నిర్ణయం ఇప్పటికే పేదరికంలో ఉన్న పాక్ ప్రజలపై మరింత ఒత్తిడి పెంచనుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకబోతోంది. అయితే, పెరిగిన భారం నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ కొన్ని రాయితీలను ప్రకటించారు. టూ వీలర్ వాహనదారులకు నెలకు 20 లీటర్ల వరకు, లీటరుకు 100 రూపాయల సబ్సిడీని మూడు నెలల పాటు ఇవ్వనున్నారు. అలాగే చిన్న రైతులకు ఎకరానికి 1,500 రూపాయల చొప్పున ఒకేసారి ఆర్థిక సాయం అందించనున్నారు.

పరిమిత వనరుల కారణంగా భారీ స్థాయిలో సబ్సిడీలు ఇవ్వడం ఇకపై సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటికే గత మూడు వారాల్లో 129 బిలియన్ రూపాయల సబ్సిడీ ఇచ్చామని, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో ఇలాగే కొనసాగించడం కష్టమని మంత్రి మాలిక్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యలను ఉధృతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు