/rtv/media/media_files/2026/06/01/pahalgam-terror-attack-2026-06-01-13-00-48.jpg)
Pahalgam Terror Attack
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో గతేడాది జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రభుత్వ, కార్పొరేట్ వ్యవస్థల హస్తం ఉందనడానికి సరికొత్త, తిరుగులేని డిజిటల్ ఆధారాలు లభించాయి. ఈ దాడిపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఉగ్రవాదులు ఉపయోగించిన సాంకేతిక పరికరాలను విశ్లేషించగా.. పాకిస్థాన్‌కు చెందిన ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంకుతో నేరుగా ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీల లింకు బయటపడింది. సరిహద్దుల అవతల నుంచి నడుస్తున్న అంతర్జాతీయ టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్‌ను ఈ ఆధారాలు మరోసారి ప్రపంచం ముందు బట్టబయలు చేశాయి.
దాడి జరిగిన అనంతరం ఘటనా స్థలం నుంచి ఎన్‌ఐఏ దర్యాప్తు బృందాలు ఉగ్రవాదులకు చెందిన రెండు అత్యాధునిక షావోమీ (Xiaomi) బ్రాండ్ మొబైల్ ఫోన్లను (రెడ్‌మీ 9టీ, నోట్ 12) స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఫోన్ల ఐఎంఈఐ (IMEI) నంబర్లు, గ్లోబల్ షిప్‌మెంట్ డేటాను అధికారులు నిశితంగా పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. వీటిలో ఒక ఫోన్‌ను 2021లో పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 'టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్' అనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగుమతి సంస్థ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫోన్ల కన్సైన్‌మెంట్, ఇంపోర్ట్ ఫైనాన్సింగ్ వ్యవహారాలన్నీ పాకిస్థాన్‌లోని 'ఫైసల్ బ్యాంక్' (Faysal Bank) ద్వారానే జరిగాయని ఎన్‌ఐఏ డిజిటల్ ఆధారాలు సేకరించింది.
ఈ దర్యాప్తులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఉగ్రవాదుల వ్యూహాత్మక నిశ్శబ్దం. స్వాధీనం చేసుకున్న ఈ రెండు ఫోన్లను వరుసగా 2021,2023 సంవత్సరాలలోనే పాకిస్థాన్‌కు దిగుమతి చేసుకున్నప్పటికీ.. పహల్గామ్ ఉగ్రదాడి జరిగేంత వరకు వాటిని ఒక్కసారి కూడా స్విచ్ ఆన్ చేయలేదు. అంటే, కమ్యూనికేషన్ నిఘా సంస్థల కంటపడకుండా ఉండేందుకు, కేవలం ఒక పెద్ద దాడి కోసం ఎంపిక చేసిన ఉగ్రవాదికి అప్పగించేందుకే ఈ ఫోన్లను ఇన్నాళ్లూ 'స్లీపర్ మోడ్'లో (పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి) ఉంచారని ఎన్‌ఐఏ భావిస్తోంది. దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా కమాండర్, పాక్ ఉగ్రవాది 'ఫైసల్ జాట్' స్వయంగా ఈ ఫోన్లను సరిహద్దులు దాటించి కాశ్మీర్‌లోకి తెచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఫైసల్ బ్యాంక్.. ఉగ్రవాదానికి పాత చిరునామా
పహల్గామ్ దాడిలో ఈ బ్యాంకుకు నేరుగా తక్షణ ప్రమేయం లేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడంలో ఫైసల్ బ్యాంకుకు దశాబ్దాల చరిత్ర ఉందని రికార్డులు చెబుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన లష్కరే తయ్యిబా (LeT), లజ్నత్ అల్ దవాతో పాటు అంతర్జాతీయ ఉగ్ర ముఠా అల్-ఖైదా (Al-Qaeda)తో సంబంధాలున్న ఒక కువైట్ సంస్థ గతంలో ఈ ఫైసల్ బ్యాంకు ద్వారానే భారీ ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ బ్యాంకులోనే సదరు ఉగ్రవాద సంస్థలు తమ రహస్య డిపాజిట్లను, విరాళాలను భద్రపరుస్తున్నాయని 2007లోనే ఒక ప్రముఖ అమెరికా పత్రిక పరిశోధనాత్మక కథనంలో అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం ఎన్‌ఐఏ సేకరించిన ఈ కొత్త డిజిటల్, ఫైనాన్షియల్ ఆధారాలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను మరింత డిఫెన్స్‌లో పడేసే అవకాశం ఉంది. టెర్రర్ ఫండింగ్‌ను అరికట్టడంలో పాక్ విఫలమవుతోందని నిరూపించడానికి, సరిహద్దు దాటి వస్తున్న డిజిటల్ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఎన్‌ఐఏ ఈ నివేదికను గ్లోబల్ ఏజెన్సీలకు కూడా సమర్పించే యోచనలో ఉంది.
Follow Us