/rtv/media/media_files/2026/05/31/pakistan-aids-terror-networks-2026-05-31-17-04-25.jpg)
Pakistan Aids Terror Networks
Pakistan : ఉగ్రవాద పోషణలో పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్ర నెట్‌వర్క్‌లను నిరంతరం యాక్టివ్‌గా ఉంచేందుకు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తోంది. ఇందుకోసం సరిహద్దు నియంత్రణ రేఖ (LoC) వెంట భారత్ వైపునకు అక్రమంగా సెల్యూలర్ సంకేతాలను (మొబైల్ సిగ్నల్స్) పంపిస్తూ సరికొత్త కుట్రలకు తెరలేపింది. ఉగ్రవాదులు తమ హ్యాండ్లర్లతో రహస్యంగా కమ్యూనికేట్ చేయడానికి ఈ అక్రమ సిగ్నల్స్ ప్రధాన ఊపిరిగా మారుతున్నాయని భారత భద్రతా అధికారులు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో పాక్ అనుసరిస్తున్న వ్యూహాలు భారత రక్షణ దళాల అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన దక్షిణ పీర్ పంజాల్ పర్వతశ్రేణుల గుండా భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో సరిహద్దుకు అత్యంత సమీపంలో పాకిస్థాన్ ఏర్పాటు చేసిన మొబైల్ సెల్ టవర్ల సంకేతాలు నేరుగా కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్న భారత జైళ్ల వరకు చేరుతున్నాయి. కశ్మీర్‌లోని ఎత్తైన పర్వతశ్రేణులు సహజ రక్షణ కవచంలా ఉండి ఈ సిగ్నల్స్‌ను చాలా వరకు అడ్డుకుంటున్నా, మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జమ్మూ రీజియన్‌లో మాత్రం ఈ సంకేతాలు సులువుగా భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
భారత రక్షణ దళాలు జమ్మూ కశ్మీర్ పరిధిలోని కతువా, రాజౌరీ, పూంచ్ జిల్లాలతో పాటు జమ్మూలోని అత్యంత కీలకమైన 'కోట్ బల్వాల్' జైలు వంటి సున్నితమైన ప్రదేశాల వద్ద ఈ పాకిస్థానీ టెలికామ్ సిగ్నల్స్‌ను స్పష్టంగా గుర్తించాయి. ఇప్పటికే ఈ పరిధిలోని కొన్ని ప్రధాన జైళ్లలో సిగ్నల్స్‌ను నిరోధించేందుకు అత్యాధునిక జామర్లను ఏర్పాటు చేసినప్పటికీ, పాక్ పంపుతున్న ఈ అక్రమ తరంగాలను అడ్డుకోవడంలో అవి పూర్తిగా విఫలమవుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని, అక్రమ మార్గాల్లో కారాగారాల లోపలికి చేరిన మొబైల్ ఫోన్లను ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మొత్తం 14 జైళ్లు, రెండు కరెక్షన్ హోమ్‌లు (బాలనేరస్థుల సంరక్షణ కేంద్రాలు) ఉన్నాయి.
ఈ అక్రమ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ వెనుక చైనా హస్తం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన టవర్లు చైనాకు చెందిన ‘సీడీఎంఏ’ (CDMA) సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఈ చైనా టెక్నాలజీ ద్వారా అత్యున్నత స్థాయి ఎన్‌క్రిప్షన్ (రహస్య కోడింగ్) సాధ్యమవుతుంది, ఇది ఉగ్రవాదులు విస్తృతంగా వాడే వైఎస్‌ఎంఎస్ (YSMS) కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్‌కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఒకే సమయంలో అనేక సిగ్నల్స్‌ను అనుమతించే ఈ సీడీఎంఏ సాంకేతికత కారణంగా భారత భద్రతా ఏజెన్సీలకు ఎలక్ట్రానిక్ మానిటరింగ్ (సైబర్ నిఘా) చేయడం అత్యంత సమస్యాత్మకంగా మారుతోంది. ఈ సిగ్నల్స్ ఆధారంగానే జైళ్లలోని ఉగ్రవాదులు, చొరబాటుదారులు పీవోకేలోని తమ హ్యాండ్లర్లతో మరియు ఇక్కడ వారికి స్థానికంగా ఆశ్రయం కల్పించే వారితో (Over Ground Workers) నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
ఈ రకమైన దొంగచాటు టెలికాం పద్ధతుల ద్వారా పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి (UN) పరిధిలోని 'అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్' (ITU) రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్‌ను బహిరంగంగా ఉల్లంఘిస్తోందని అధికారులు ధ్వజమెత్తారు. ఈ అంతర్జాతీయ ఆర్టికల్ ప్రకారం.. ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, పాక్‌లతో సహా మొత్తం 193 సభ్య దేశాలు తమ సొంత భూభాగం నుంచి అధిక తీవ్రత గల, రోగ్ (విధ్వంసకర), తప్పుడు లేదా పక్కదారి పట్టించే ఎలాంటి రేడియో/సెల్యూలర్ సంకేతాలు పొరుగు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లకుండా పరస్పరం సహకరించుకోవాలి. కానీ పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, చైనా సాంకేతికత సాయంతో భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే ఈ సిగ్నల్స్ చొరబాటుకు పాల్పడుతోందని రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Follow Us