Myanmar : మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లైంగ్: ఇంతకు ఎవరీతను?

మయన్మార్ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పుడు అధికారికంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

New Update
mayanmar

మయన్మార్(myanmar) రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్(Min Aung Hlaing) ఇప్పుడు అధికారికంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్లమెంటు ఓటింగ్‌లో ఆయనకు మెజారిటీ రావడంతో ఈ కీలక పరిణామం జరిగింది. అయితే ఈ ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన ఎన్నికలను ఐక్యరాజ్యసమితితో పాటు అనేక పాశ్చాత్య దేశాలు తప్పుబట్టాయి. సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించుకోవడానికే ఈ దొంగ ఎన్నికలు నిర్వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read :  భారతీయల ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తాం..  పాక్ రక్షణ మంత్రి బలుపు మాటలు!

సైన్యాధిపతి పదవికి రాజీనామా చేసి

ఈ పదవిని చేపట్టడం కోసం మిన్ ఆంగ్ హ్లైంగ్ తన సైన్యాధిపతి పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచారు. సైన్యానికి మద్దతుగా నిలిచే 'యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ' పార్లమెంటులో ఏకంగా 80 శాతానికి పైగా సీట్లను గెలుచుకోవడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. 2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండి 69 ఏళ్ల హ్లైంగ్ మయన్మార్‌కు అనధికారిక నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన నమ్మకస్థుడైన ఏ విన్ ఊకు సైన్య బాధ్యతలు అప్పగించి, పౌర పాలకుడిగా తన ముఖాన్ని మార్చుకున్నారు.

మయన్మార్ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా హ్లైంగ్‌కు పేరుంది. దావై అనే జాతికి చెందిన ఆయన, మూడో ప్రయత్నంలో ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడుల్లో ఆయన పోషించిన పాత్ర ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఆ సమయంలో దాదాపు ఏడున్నర లక్షల మంది ప్రజలు ప్రాణభయంతో బంగ్లాదేశ్‌కు పారిపోయారు. 2021లో కుట్రతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన, ఆంగ్ సాన్ సూకీని జైలు పాలు చేసి దేశంలో అంతర్యుద్ధానికి కారణమయ్యారు.

ప్రస్తుతం మయన్మార్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు సుమారు 93 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 36 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదిలేసి శరణార్థులుగా మారారు. ఇప్పుడు హ్లైంగ్ అధ్యక్షుడైనప్పటికీ, దేశంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. యూనిఫాం తీసేసి సూటు వేసుకున్నంత మాత్రాన అధికారం మాత్రం ఆయన చేతుల్లోనే ఉంటుందని, ఇది కేవలం లోకాన్ని నమ్మించడానికి చేస్తున్న ఒక సాంకేతిక మార్పు మాత్రమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read :  ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం: ఎనిమిది మంది మృతి!

Advertisment
తాజా కథనాలు