Indonesia : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. పేలిన అగ్నిపర్వతం!

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో ఒక్కసారిగా బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీపంలో ఉన్న ముగ్గురు పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

New Update
indonesia

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో ఒక్కసారిగా బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీపంలో ఉన్న ముగ్గురు పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో సింగపూర్‌కు చెందిన ఇద్దరు పౌరులతో పాటు ఒక ఇండోనేషియా స్థానికుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి, అగ్నిపర్వత ముఖద్వారం వద్ద చిక్కుకుపోయిన మరో 17 మంది పర్వతారోహకులను సురక్షితంగా రక్షించాయి.

ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లోని హల్మహెరా ద్వీపంలో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతాన్ని అధిరోహించేందుకు గురువారం తొమ్మిది మంది విదేశీయులు, 11 మంది స్థానిక హైకర్లతో కూడిన 20 మంది బృందం బయలుదేరింది. శుక్రవారం ఉదయం 7:41 గంటల సమయంలో వీరంతా పర్వత శిఖరానికి చేరుకుని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న తరుణంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. భారీ ఎత్తున పొగ, బూడిద, వేడి రాళ్లు పైకి ఎగిసిపడ్డాయి. 

ఈ ప్రమాదం నుంచి ఇద్దరు జర్మన్ పర్యాటకులతో కలిసి తృటిలో తప్పించుకున్న స్థానిక మౌంట్ గైడ్ అలెక్స్ జాంగు ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం నుంచే భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడం గమనించి డ్రోన్ ద్వారా పరిశీలించగా.. క్రేటర్ లోపల లావాతో కూడిన పదార్థాలు అసాధారణంగా పేరుకుపోయినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం మేము శిఖరానికి 100 మీటర్ల దూరంలో ఉండగా పెద్ద విస్ఫోటనం జరిగింది. కొందరు పర్యాటకులు అగ్నిపర్వత అంచున నిలబడి వీడియోలు తీసుకుంటున్నారు. రాళ్లు జారిపడుతుండటంతో నా క్లయింట్లను తీసుకుని కిందికి పరుగులు తీశానని జాంగు తెలిపారు.

ముగ్గురి మృతదేహాలు ఇంకా పర్వతం పైనే

టెర్నేట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 20 మంది పర్వతారోహకులలో 17 మందిని శుక్రవారం సాయంత్రం నాటికి సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. కొందరు గాయపడగా వారిని స్ట్రెచర్లపై ఆసుపత్రికి తరలించారు. అయితే, మరణించిన ముగ్గురి మృతదేహాలు ఇంకా పర్వతం పైనే ఉండిపోయాయి. అగ్నిపర్వతం నుంచి నిరంతరం శబ్దాలు వస్తుండటం, ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు. శనివారం ఉదయం మళ్లీ మృతదేహాల వెలికితీత ప్రక్రియను ప్రారంభించనున్నారు.

నిజానికి మౌంట్ డుకోనో అగ్నిపర్వతంలో గత డిసెంబర్ 2024 నుంచే కదలికలు పెరిగాయి. ఈ ఏడాది మార్చి నుంచి లావా విస్ఫోటనాలు తీవ్రమవ్వడంతో.. అగ్నిపర్వత కేంద్రానికి 4 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదని దేశ అగ్నిపర్వత శాస్త్ర సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, పర్వతంపైకి వెళ్లే దారుల్లో ఎలాంటి చెక్ పోస్టులు, అటవీ రక్షణ సిబ్బంది లేకపోవడంతో పర్యాటకులు నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారు.

భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు అత్యంత ప్రమాదకరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటంతో అక్కడ తరచూ ఇలాంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ఈ తాజా ప్రమాదం నేపథ్యంలో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను, పర్యాటకులను హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు