Mpox : పాకిస్థాన్‌లో ఎంపాక్స్ కలకలం : ఏడుగురు శిశువుల మృతి!

పాకిస్థాన్‌ను మరో కొత్త ఆరోగ్య సంక్షోభం వణికిస్తోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ దేశంలో, ఇప్పుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్‌పూర్ పట్టణంలో ఏడుగురు శిశువులు మృతి చెందగా, వారిలో నలుగురికి ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది.

New Update
mpox

పాకిస్థాన్‌ను మరో కొత్త ఆరోగ్య సంక్షోభం వణికిస్తోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ దేశంలో, ఇప్పుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్‌పూర్ పట్టణంలో ఏడుగురు శిశువులు మృతి చెందగా, వారిలో నలుగురికి ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌లో స్థానికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం  ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

నలుగురు పిల్లలకు వైరస్

మరణించిన శిశువుల రక్త నమూనాలను కరాచీలో పరీక్షించగా, నలుగురు పిల్లలకు ఈ వైరస్ సోకినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు చర్మంపై తీవ్రమైన పుండ్లు రావడంతో ఈ పిల్లలను ఆసుపత్రిలో చేర్చినట్లు డాక్టర్ అహ్మద్ షేక్ తెలిపారు. ఈ వైరస్ సోకిన జంతువుల ద్వారా లేదా మనుషుల మధ్య సన్నిహిత సంబంధాల వల్ల వ్యాపిస్తుంది.

ఆరోగ్య శాఖ మరో వివరణ

అయితే, ఈ మరణాలపై ఆరోగ్య శాఖ మరో వివరణ ఇచ్చింది. చనిపోయిన పిల్లలందరూ నెలలు నిండకుండా పుట్టారని, అతి తక్కువ బరువుతో పాటు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. అంటే, కేవలం ఎంపాక్స్ వల్లే వారు చనిపోలేదని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమని ప్రభుత్వం పేర్కొంది.

ముందు జాగ్రత్త చర్యగా ఖైర్‌పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను (NICU) తాత్కాలికంగా మూసివేశారు. వైరస్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరి ద్వారా వ్యాపించింది అనే అంశాలపై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. బాధితులతో సంబంధం ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.

చర్మంపై వింత దద్దుర్లు

పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ సమాచారం ప్రకారం.. సుక్కుర్, ఖైర్‌పూర్, మీర్‌పుర్‌ఖాస్, హైదరాబాద్ ప్రాంతాల్లో చర్మంపై వింత దద్దుర్లు, గడ్డలతో దాదాపు 15 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ మరింత విస్తరించకుండా వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు ఖైర్‌పూర్ డిప్యూటీ కమిషనర్ అల్తాఫ్ అహ్మద్ వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు