/rtv/media/media_files/2026/03/13/mojtaba-khamenei-2026-03-13-09-46-29.jpg)
ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్‌ను పాలించిన ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ(56) దేశపు మూడవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ పదవి ఆయనకు వారసత్వంగా ఊరికే రాలేదు. దీని వెనుక 17 ఏళ్ల వయస్సు నుంచే ఆయన రహస్యంగా నిర్మించుకున్న ఓ స్ట్రాంగ్ నెట్‌వర్క్ ఉంది. దేశం కోసం ఆయన చేసిన సేవ గురించి ఒక్క పాటలో చెప్పాలంటే నల్గొండ గద్దర్ పాడిన ఈ లిరిక్స్ సెట్ అవుతాయి. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు.. ఎదురించుకుంటు ఎక్కినరా ఒక్కొక్క మెట్టు!!
యుద్ధ భూమిలో మొదలైన ప్రయాణం
మొజ్తబా ఖమేనీ కేవలం ఓ నాయకుడి కుమారుడిగా మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో సైనిక అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కేవలం 17 ఏళ్ల వయస్సులోనే ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొని, రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) లోని 'హబీబ్ బెటాలియన్'లో పనిచేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు పనిచేసిన యువ సైనికులే నేడు ఇరాన్ నిఘా, భద్రతా విభాగాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఈ చిన్ననాటి స్నేహాలే ఆయన అధికారానికి ప్రధాన పునాదిగా మారాయి.
అధికార కేంద్రానికి ‘గేట్ కీపర్’
గత రెండు దశాబ్దాలుగా మొజ్తబా ఎటువంటి అధికారిక ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. కానీ, తన తండ్రి ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తూ, ఎవరెవరు సుప్రీం లీడర్‌ను కలవాలి, ఏయే ఫైళ్లు ఆయన ముందుకు వెళ్లాలి అనే అంశాలను నియంత్రించేవారు. ఈ ‘గేట్ కీపర్’ పాత్ర ద్వారా ఆయన ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు.
షాడో' నెట్‌వర్క్
ఇరాన్‌లోని శక్తివంతమైన పారామిలిటరీ దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్‌తో మొజ్తబాకు విడదీయలేని బంధం ఉంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఆయన రహస్యంగా ఓ సైనిక, ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించారు. 2009లో జరిగిన ఎన్నికల అణిచివేతలో కూడా ఈయన పాత్ర కీలకమని ఆరోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్స్‌పై ఆయనకున్న పట్టు కారణంగానే, ఎంపిక కమిటీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
వారసత్వ రాజకీయంపై భిన్నాభిప్రాయాలు
ఇరాన్ విప్లవం (1979) రాచరికాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యబద్ధమైన మత పాలనను తీసుకువచ్చింది. అయితే, తండ్రి తర్వాత కొడుకు పదవిని చేపట్టడం ఇరాన్ సిద్ధాంతాలకు విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు. కానీ, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ఒక కరుడుగట్టిన, సైనిక పట్టున్న నాయకుడు కావాలని హార్డ్‌లైనర్లు మొజ్తబా వైపు మొగ్గు చూపారు.
గ్లోబల్ సవాళ్లు - అమెరికా హెచ్చరికలు
మొజ్తబా బాధ్యతలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నియామకాన్ని "అంగీకరించలేనిది" గా అభివర్ణించారు. యుద్ధ సమయంలో బాధ్యతలు చేపట్టిన మొజ్తబా, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Follow Us