Kharg Island: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నా.. ఆ ప్రాంతాన్ని టచ్ చేయలేకపోతున్న ట్రంప్

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖార్గ్ ఐలాండ్‌పై ఇప్పటివరకు అమెరికా దాడి చేయకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం.

New Update
Kharg Island

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధంలో ట్రంప్ భయపడుతున్నాడు. అగ్రదేశంతో కలిసి ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో పైచేయి సాధిస్తున్న ట్రంప్ ఇరాన్‌లో ఓ ప్లేస్‌ని టచ్ చేయడానికికే వణికిపోతున్నాడు. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖార్గ్ ఐలాండ్‌పై ఇప్పటివరకు అమెరికా దాడి చేయకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలంటే ఇలాంటి స్థావరాలపై ముందుగా ట్రంప్ దాడులు చేస్తాడని విశ్లేషకులు భావించారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్ ఖార్గ్ దీవి జోలికి వెళ్లడం లేదు.

పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% ఇక్కడి నుండే జరుగుతాయి. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల చమురును లోడ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని దెబ్బతీస్తే ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం, కానీ అమెరికా ఇక్కడ 'రెడ్ లైన్' గీసుకుంది.

అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

గ్లోబల్ ఆయిల్ మార్కెట్ సంక్షోభం:
ఖార్గ్ ఐలాండ్‌పై దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బారెల్‌కు 100 డాలర్లు దాటింది. ఈ కీలక కేంద్రం ధ్వంసమైతే సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడి, పెట్రోల్ ధరలు పెరిగి ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

ఇరాన్ రివేంజ్ భయం:
ఈ ద్వీపంపై దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ మార్గం గుండానే సాగుతుంది. అంతేకాకుండా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాల చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసే ముప్పు ఉంది, ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది.

చైనా ప్రయోజనాలు:
ఇరాన్ నుండి ఎగుమతయ్యే చమురులో దాదాపు 80% చైనాకే వెళ్తుంది. ఖార్గ్ ఐలాండ్‌ను టార్గెట్‌గా చేసుకుంటే చైనాతో అమెరికాకు నేరుగా దౌత్యపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

భవిష్యత్తు ప్రభుత్వంపై ప్రభావం:
ఒకవేళ యుద్ధం వల్ల ఇరాన్‌లో పాలన మారినా, దేశాన్ని పునర్నిర్మించడానికి చమురు మౌలిక సదుపాయాలు అవసరం. వాటిని ఇప్పుడే పూర్తిగా ధ్వంసం చేస్తే, భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా దేశాన్ని నడపడం అసాధ్యమని వాషింగ్టన్ విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతానికి అమెరికా కేవలం ఇరాన్ సైనిక, అణు స్థావరాలపైనే దృష్టి పెట్టింది. అయితే, యుద్ధం మరింత ముదిరితే లేదా ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే 'ఖార్గ్' వ్యూహం మారే అవకాశం లేకపోలేదు.

Advertisment
తాజా కథనాలు