/rtv/media/media_files/2026/04/11/kamala-2026-04-11-07-21-38.jpg)
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని ఆమె తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన 'నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్' (NAN) సదస్సులో పాల్గొన్న ఆమెను, రెవరెండ్ అల్ షార్ప్టన్ నేరుగా మీరు మళ్లీ పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. "నేను దాని గురించి ఆలోచిస్తున్నాను.. అవును, నేను మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది" అని బదులిచ్చారు. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలైన తర్వాత, తన తదుపరి అడుగుపై ఆమె ఇంత స్పష్టంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.
ఈ సదస్సులో కమలా హారిస్‌కు ఘన స్వాగతం లభించింది. ఆమె మాట్లాడుతుండగా సభికుల నుంచి "మళ్లీ పోటీ చేయండి" అనే నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆమె వైస్ ప్రెసిడెంట్‌గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో తాను గడిపిన సమయం, సిట్యుయేషన్ రూమ్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఆ పదవికి కావాల్సిన బాధ్యతలు ఏమిటో తనకు పూర్తిగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పినప్పటికీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె మాటల ద్వారా స్పష్టమవుతోంది.
దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా
గత ఏడాది కాలంగా తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా సమయం గడిపానని కమలా హారిస్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మంది ప్రజలకు సంతృప్తిని ఇవ్వడం లేదని, మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "స్టేటస్ కో" (ప్రస్తుత పరిస్థితి) ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రజల కోసం చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని ఆమె అన్నారు. 2025 చివరలో ఆమె '107 డేస్' అనే పుస్తకాన్ని విడుదల చేసి, ప్రస్తుతం బుక్ టూర్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ పర్యటనలు ఆమె రాబోయే ఎన్నికల కోసం చేస్తున్న సన్నాహాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సదస్సులో కమలా హారిస్‌తో పాటు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మరికొందరు కీలక నేతలు కూడా పాల్గొన్నారు. పీట్ బుట్టిగీగ్, జోష్ షాపిరో వంటి నేతలు కూడా 2028 రేసులో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, అల్ షార్ప్టన్ మాత్రం కమలా హారిస్‌ను సమర్థిస్తూ.. 2024 ఎన్నికల్లో ఆమెకు 7.5 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయని, అది బరాక్ ఒబామా కంటే కూడా ఎక్కువని గుర్తు చేశారు. ఏదేమైనా, కమలా హారిస్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Follow Us