/rtv/media/media_files/2026/04/10/israel-lebanon-war-2026-04-10-19-39-42.jpg)
Israel Lebanon war
Israel Lebanon war : ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ లెబనాన్ పై మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ఇరాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ రోజు లెబనాన్‌లోని రెండు పట్టణాలపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయని, తద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆ దేశం ఆరోపించింది. దీనికి ప్రతీగా హెజ్‌బొల్లా దాడులు జరిపినట్లు వెల్లడించింది. మరోవైపు, లెబనాన్‌లో దాడులు ఆపకపోతే అమెరికాతో జరిపే శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకకు తగ్గకపోగా దాడులు మరింత తీవ్రం చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లోని మిస్గావ్ ఆమ్ ప్రాంతంలో రాకెట్ దాడులు చేసినట్లు హెజ్ బొల్లా ప్రకటించింది. తమ ప్రజలను రక్షించుకోవడంలో భాగంగానే ఈ ప్రతీకార దాడులకు దిగినట్లు హెజ్‌బొల్లా పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోన్నదని, లెబనాన్ గ్రామాలపై దాడులు చేస్తుందని లెబనాన్ ఆరోపించింది. అందువల్లే తాము ఈ విధంగా ప్రతిస్పందించాల్సి వస్తోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, రెండు వారాల పాటు కాల్పుల విరమణ విషయంలో అమెరికాతో జరిగే చర్చల్లో లెబనాన్ అంశం కూడా ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్ ఇటీవల కేవలం పది నిమిషాల్లోనే 100 లక్ష్యాలపై దాడులు చేసినట్లు లెబనాన్ ఆరోపించింది.
ఇరాన్ మాజీ మంత్రి మృతి
కాగా ఇరాన్‌లో ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో గాయపడిన ఆ దేశ మాజీ విదేశాంగశాఖ మంత్రి కమాల్ ఖరాజీ మృతి చెందాడు. ఈ విషయాన్ని టెహ్రాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ సంస్కరణవాది, అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ హయాంలో ఖరాజీ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి విదేశీ వ్యవహారాల సలహాదారుడిగా పనిచేశారు. 2022లో ఆయన మాట్లాడుతూ అణుబాంబు తయారు చేసే సాంకేతిక సామర్థ్యం ఇరాన్‌కు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, దీన్ని రూపొందించడంపై ఇరాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.
Follow Us