Mahmoud Ahmadinejad : ఇరాన్‌ కొత్త సుప్రీం  లీడర్‌గా ఇజ్రాయెల్ బద్ధశత్రువు?..పాలనా మార్పులో ట్రంప్ మైండ్ గేమ్‌.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి చేయడం వెనుక కేవలం ఇరాన్ సైనిక శక్తిని అణచడమే కాకుండా, టెహ్రాన్‌లో పూర్తిస్థాయి 'పాలనా మార్పు' (Regime Change) తీసుకురావాలనే ఒక రహస్య వ్యూహాన్ని అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

New Update
FotoJet - 2026-05-20T163828.234

Former President as Iran’s Leader

Mahmoud Ahmadinejad : పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని మలుపు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన ఆకస్మిక దాడులు, అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హతమార్చటం... ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడుల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇరాన్ సైనిక శక్తిని అణచడమే కాకుండా, టెహ్రాన్‌లో పూర్తిస్థాయి 'పాలనా మార్పు' (Regime Change) తీసుకురావాలనే ఒక రహస్య వ్యూహాన్ని అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యూహంలో భాగంగా ఇరాన్ తదుపరి పగ్గాలు చేపట్టేందుకు ట్రంప్ ఎంచుకున్న ఆ "అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి" మరెవ్వరో కాదు.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ (Mahmoud Ahmadinejad).

'ఆపరేషన్ రోరింగ్ లయన్'.. తెరవెనుక ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్

మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనం ప్రకారం.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా ప్రతిష్టించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ (Operation Roaring Lion),‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) లతో వ్యూహాత్మక ప్లాన్ సిద్ధం చేశాయి.

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇరాన్ రాజకీయ, సామాజిక, సైనిక పరిస్థితులను సమర్థంగా నిర్వహించగల సత్తా అహ్మదీనెజాద్‌కు మాత్రమే ఉందని అమెరికా భావించినట్లు ఆయన సహచరుడు ఒకరు స్పష్టం చేశారు. అయితే, ఇక్కడే ఒక పెద్ద విచిత్రం ఉంది. అహ్మదీనెజాద్ తన గత పాలనా కాలంలో కఠినమైన అమెరికా వ్యతిరేక, ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలకు,'హోలోకాస్ట్'ను నిరాకరించిన వ్యక్తిగా పేరుగాంచారు. ఒకానొక సమయంలో "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని పిలుపునిచ్చిన వ్యక్తిని, ఇజ్రాయెల్ దళాలే స్వయంగా అధికారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేయడం అంతర్జాతీయ రక్షణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, గత దశాబ్ద కాలంగా అహ్మదీనెజాద్ ఇరాన్ ప్రస్తుత ఇస్లామిక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిగా మారారు. ఈ కారణంగానే ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించి, నిఘా నీడలో ఉంచింది. ఆయన నివాసం వద్ద ఇరాన్ ప్రభుత్వం భద్రత పేరిట గృహ నిర్బంధాన్ని అమలు చేసింది.యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇజ్రాయెల్ దళాలు అహ్మదీనెజాద్ నివాసంపై దాడి చేశాయి. దీని ముఖ్య ఉద్దేశం ఆయనను ఇరాన్ ప్రభుత్వ నిర్బంధం నుండి విడిపించి, తమ ప్రణాళికకు అనుకూలంగా వాడుకోవడమే. అయితే, ఈ క్షిపణి దాడిలో అహ్మదీనెజాద్ గాయాలతో ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ 'పాలనా మార్పు' డ్రామాపై ఆయన తీవ్ర విరక్తి చెందారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఆ దాడి తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది ఒక మిస్టరీగా మారింది.

ట్రంప్ ఈ తరహా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల వెనిజులా పాలకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. మదురో తొలగింపు అనంతరం అక్కడ డెల్సీ రోడ్రిగ్జ్ అధికారం చేపట్టిన విధంగానే, ఇరాన్‌లో ఖమేనీ పతనం తర్వాత అహ్మదీనెజాద్‌ను అడ్డం పెట్టుకుని ఇరాన్‌ను నియంత్రించవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది.ఈ సంచలన వార్తలపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ, పాలనా మార్పు వార్తలపై నేరుగా వ్యాఖ్యానించలేదు కానీ, సైనిక విజయాలను ధృవీకరించారు:

"మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను, వాటి ఉత్పత్తి కేంద్రాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం, వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం ఈ లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది. ప్రస్తుతం మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా అంతమొందించే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు."

మరోవైపు, ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్‌లోని ఆయన సొంత సహాయకులే కొందరు తప్పుబడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా, ఇరాన్ భవిష్యత్తును మార్చాలని చూసిన అమెరికా, ఇజ్రాయెల్‌ల 'మాస్టర్ ప్లాన్' ప్రస్తుతానికి బెడిసికొట్టినట్లుగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు