Iran : తిరగబడ్డ ఇరాన్: యూఏఈ, కువైట్‌లపై క్షిపణి దాడులు!

కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుధవారం ఉదయం ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో ఉన్న కీలకమైన లావన్ ఆయిల్ రిఫైనరీపై భీకర దాడి జరిగింది.

New Update
fire

కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుధవారం ఉదయం ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో ఉన్న కీలకమైన లావన్ ఆయిల్ రిఫైనరీపై భీకర దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన గంటలోపే ఇరాన్ ఎదురుదాడికి దిగింది. తమ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు లావన్ రిఫైనరీపై ఈ పిరికిపంద  దాడి జరిగిందని ఇరాన్ జాతీయ చమురు సంస్థ (NIORDC) వెల్లడించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ సిబ్బందిని ముందే ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగానే ఉన్నప్పటికీ, ప్రజలు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రభుత్వం కోరింది.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా

రిఫైనరీపై దాడి జరిగిన వెంటనే ఇరాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా యూఏఈ, కువైట్‌లలోని పలు లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన సమయంలోనే.. "మా చేతులు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి, యుద్ధం ఇంకా ముగిసిపోలేదు" అని ఇరాన్ భద్రతా మండలి హెచ్చరించిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.

పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ రిఫైనరీ 1976 నుండి నడుస్తోంది. ఇది రోజుకు సుమారు 55,000 బారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తూ దక్షిణ ఇరాన్‌కు అవసరమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ కేంద్రంపై దాడి జరగడం వల్ల ఆ ప్రాంతంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది.

అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ తాజా ఉద్రిక్తతలు చర్చల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.

Advertisment
తాజా కథనాలు