/rtv/media/media_files/2026/03/31/spy-2026-03-31-21-22-13.jpg)
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ ప్రభుత్వం అంతర్గత భద్రత విషయంలో కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. గత నెల రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్‌లతో సాగుతున్న భీకర యుద్ధం గురించి తెలిసిందే. ఈక్రమంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. శత్రు దేశాల కోసం గూఢచర్యం చేసే వారికి లేదా వారికి పరోక్షంగా సహాయపడే వారికి 'మరణశిక్ష' విధిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ సంచలన ప్రకటన చేసింది.
ఇరాన్ న్యాయవ్యవస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం గూఢచర్యమే కాకుండా, శత్రువుకు వ్యూహాత్మక ప్రయోజనం చేకూర్చే ఏ చిన్న చర్య అయినా నేరంగానే పరిగణించబడుతుంది.
సైనిక స్థావరాలు, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు లేదా వీడియోలను చిత్రీకరించి పంచుకోవడం.
సైనిక కార్యకలాపాల సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.
శత్రువుకు లక్ష్యాలను గుర్తించడంలో సహాయపడే సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం.
ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి కనీస శిక్షగా మరణశిక్షను ఖరారు చేయడమే కాకుండా, వారి ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుందని హెచ్చరించింది.
వెయ్యి మందికి పైగా అరెస్టు
ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం, గత నెల రోజుల్లోనే దాదాపు 1,000 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్‌ను ప్రచారం చేసిన వారు, సున్నితమైన ప్రాంతాల వీడియోలను లీక్ చేసిన వారు ఉన్నారు. ఇప్పటికే 200 మందిపై అధికారికంగా అభియోగాలు నమోదయ్యాయి. అనుమానితులను గుర్తించి, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఆస్తుల జప్తు ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించడంతో పశ్చిమ ఆసియాలో పరిస్థితి విషమించింది. ఈ యుద్ధం వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్, యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. అయితే, ఇరాన్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలపై మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం పౌర స్వేచ్ఛను హరిస్తోందని, అసమ్మతి గళాలను అణచివేయడానికే ఈ కఠిన చట్టాలను అస్త్రంగా వాడుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. యుద్ధం ముసుగులో సామాన్య పౌరులపై కూడా నిఘా పెంచడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు.
Follow Us