Iran : ట్రంప్ అన్నంత పనైంది.. ఇరాన్ అగ్రనాయకత్వంలో విభేదాలు : లీకైన సీక్రెట్ లెటర్!

ఇరాన్ అగ్రనాయకత్వంలో తీవ్రస్థాయిలో ముఠా తగాదాలు, గందరగోళం నెలకొందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ ఒక రహస్య లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

New Update
donald trump

ఇరాన్ అగ్రనాయకత్వంలో తీవ్రస్థాయిలో ముఠా తగాదాలు, గందరగోళం నెలకొందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ ఒక రహస్య లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ శక్తివంతమైన నేత మోజతాబా ఖమేనీకి రాసిన ఈ అత్యంత రహస్య లేఖ బయటికి పొక్కడంతో, ఆ దేశ ప్రభుత్వం, కరుడుగట్టిన ఛాందసవాద నేతల మధ్య ఉన్న తీవ్ర విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.

 2026 ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన సైనిక ఘర్షణల తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ప్రస్తుత పరిస్థితులు భరించలేని స్థాయికి చేరుకున్నాయని ఈ లేఖలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలంటే అమెరికాతో అణు ఒప్పందంపై తక్షణమే, అత్యంత సీరియస్‌గా చర్చలు ప్రారంభించాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.

ఈ లేఖపై సంతకాలు చేసిన వ్యక్తుల పేర్లు చూస్తే ఇరాన్ ప్రభుత్వంలో ఎంతటి మార్పు కోరుకుంటున్నారో అర్థమవుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ముస్తాఫా పౌర్ మొహమ్మదీ వంటి కీలక నేతలు ఈ లేఖపై సంతకాలు చేసి, అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని వాదించారు. అయితే, అలీ బగేరి కానీ వంటి కొంతమంది కరుడుగట్టిన నేతలు మాత్రం ఈ లేఖపై సంతకం చేయడానికి నిరాకరించారు. అమెరికాతో చర్చలు జరపడం అంటే వారి ముందు మోకరిల్లడమేనని వీరు భావిస్తున్నారు. కేవలం కొంతమంది అతి ముఖ్యమైన వ్యక్తుల కోసమే ఉద్దేశించిన ఈ లేఖ లీక్ కావడంతో ఇరాన్ అధికార వర్గాల్లో పెను అలజడి రేగింది.

ఈ రహస్య పత్రాలను లీక్ చేసిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని స్పీకర్ గాలిబాఫ్ అనుచరుడు జలీల్ మొహెబ్బీ బహిరంగంగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇరాన్‌లో మితవాదులు లేదా అతివాదులు అనే తేడాలేదని, తామంతా విప్లవాత్మకమైన ఒకే తాటిపై ఉన్నామని పెజెష్కియాన్, గాలిబాఫ్ ప్రకటిస్తున్నారు. న్యాయవ్యవస్థ అధిపతి అజెయి కూడా విభేదాల వార్తలను కొట్టిపారేశారు. 

అణు ఒప్పందంపైనే వివాదం

కానీ అసలు వివాదం అణు ఒప్పందంపైనే సాగుతోంది. అమెరికాతో అణు అంశంపై చర్చలు జరపకూడదని మోజతాబా ఖమేనీ ఒక 'లక్ష్మణ రేఖ'ను గీసినప్పటికీ, ఆంక్షలు తొలగిపోవాలంటే ఆ అంశంపై మాట్లాడక తప్పదని ప్రభుత్వ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై మహ్మద్ నబావియన్, అమీర్ హుస్సేన్ సబేటి వంటి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది వ్యూహాత్మక తప్పిదమని మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు