/rtv/media/media_files/2026/04/06/trump-2026-04-06-06-44-21.jpg)
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే కీలక సముద్ర మార్గాలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, కేవలం హార్ముజ్ జలసంధి మాత్రమే కాకుండా బాబ్ ఎల్-మందేబ్ జలసంధిని కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా గనుక ఏవైనా పొరపాట్లు చేస్తే, ప్రపంచ వాణిజ్యం, ఇంధన ప్రవాహాన్ని ఒక్క దెబ్బతో నిలిపివేయగలమని ఆయన హెచ్చరించారు. వాషింగ్టన్‌కు ఈ ప్రాంతంలో ఉన్న భౌగోళిక శక్తి గురించి ఇంకా అవగాహన లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
బాబ్ ఎల్-మందేబ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ప్రాంతం. విజువల్ క్యాపిటలిస్ట్ నివేదిక ప్రకారం, ప్రతిరోజూ ఇక్కడి నుండి దాదాపు 40 నుండి 60 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే మొత్తం చమురు వ్యాపారంలో దాదాపు 10 నుండి 12 శాతం వాటా ఈ జలసంధిదే. అయితే, ఇటీవల ఈ ప్రాంతంలో జరుగుతున్న దాడులు, భద్రతా కారణాల వల్ల 2024లో చమురు రవాణా గణనీయంగా తగ్గిందని అమెరికా ఇంధన సమాచార సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
రాకపోకలపై ఆంక్షలు
ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతూ, ఆసియా, యూరప్ దేశాల మధ్య ఒక ప్రధాన వారధిలా పనిచేస్తుంది. హార్ముజ్ జలసంధిలో రాకపోకలపై ఆంక్షలు పెరగడంతో, చాలా దేశాలు తమ రవాణా కోసం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వాడుకుంటున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలకు వెళ్లే చమురు రవాణాకు ఇది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఇక్కడ గనుక రవాణా నిలిచిపోతే, ఓడలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
భౌగోళికంగా చూస్తే బాబ్ ఎల్-మందేబ్ ఒకవైపు యెమెన్, మరోవైపు జిబౌటి, ఎరిట్రియా దేశాల మధ్య ఉంటుంది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూపులు ఇప్పటికే పలుమార్లు ఈ మార్గంలో వెళ్లే ఓడలపై దాడులకు దిగడంతో, ఈ ప్రాంతం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ తాజా హెచ్చరికలతో ప్రపంచ చమురు మార్కెట్లలో మళ్లీ అలజడి మొదలైంది.
Follow Us