/rtv/media/media_files/2026/04/09/iran-2026-04-09-07-04-59.jpg)
ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండవ వారంలోనే ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేయడంతో, దానికి నిరసనగా ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.
ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు పెంచిన నేపథ్యంలో ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇక్కడ ఆయిల్ ట్యాంకర్ల కదలికలను నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన మొదలైంది.
కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ తన రోరింగ్ లయన్ ఆపరేషన్‌లో భాగంగా లెబనాన్‌పై అతిపెద్ద సమన్వయ దాడిని నిర్వహించింది. బీరూట్, బెకా వ్యాలీ, దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లాకు చెందిన 100కు పైగా కమాండ్ సెంటర్లు, ఇంటెలిజెన్స్ హబ్‌లు, మిస్సైల్ కేంద్రాలపై ఐడీఎఫ్ (IDF) విరుచుకుపడింది. బుధవారం జరిగిన దాడుల్లో కనీసం 112 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా
హెజ్బుల్లా పౌరులను మానవ డాల్లుగా వాడుకుంటోందని, తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయల్ జమీర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హార్ముజ్ జలసంధి మూసివేత అంశం లేదని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్‌పై దాడుల గురించి అడిగినప్పుడు, "హెజ్బుల్లా ఈ డీల్‌లో భాగం కాదు, అది ఒక ప్రత్యేక పోరాటం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ తన భద్రత కోసం జరుపుతున్న దాడులకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.
Follow Us