Unreasonable Demands : అమెరికావి గొంతెమ్మ కోర్కెలు.. అందుకే పక్కన పెట్టాం.. ఇరాన్ సంచలన ప్రకటన!

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా పెట్టిన గొంతెమ్మ కోర్కెల వల్లే ఈ చర్చలు ఆగిపోయాయని ఇరాన్ ప్రకటించింది.

New Update
iran

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా పెట్టిన గొంతెమ్మ కోర్కెల వల్లే ఈ చర్చలు ఆగిపోయాయని ఇరాన్ ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడటం కోసం ఇరాన్ బృందం దాదాపు 21 గంటల పాటు నిరంతరంగా, ఎంతో కష్టపడి చర్చలు జరిపిందని, తాము ఎన్ని రకాల ప్రతిపాదనలు చేసినా అమెరికా మొండిగా వ్యవహరించడం వల్ల పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐ.ఆర్.ఐ.బి వెల్లడించింది.

మరోవైపు అమెరికా బృందానికి నాయకత్వం వహించిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ, తాము ఇచ్చిన ఆఖరి, అత్యుత్తమ ఆఫర్‌ను ఇరాన్ ఒప్పుకోలేదని చెప్పారు. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదని తాము స్పష్టంగా చెప్పామని, వారు ఆ పని చేయమని గట్టిగా హామీ ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. అమెరికా పెట్టిన నిబంధనలను ఇరాన్ అంగీకరించకపోవడం ఆ దేశానికే పెద్ద నష్టమని వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ చర్చల సమయంలో తాను ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌తో పలుమార్లు ఫోన్లో మాట్లాడానని, అమెరికా తన పరిమితులను చాలా స్పష్టంగా ఇరాన్‌కు వివరించిందని ఆయన అన్నారు. 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే మొదటిసారి.

ప్రతికారంగా ఇరాన్ కూడా

గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఆ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు మరికొందరు కీలక నేతలు మరణించారు. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేసింది. ఇరుపక్షాల దాడులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్యే డోనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించడంతో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ ప్రాంతంలో మళ్ళీ ఏం జరుగుతుందో అన్న ఆందోళన మొదలైంది.

కాగా ఈ చర్చలు విఫలం కావడం వల్ల అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా, సైనికంగా దెబ్బతిన్న ఇరాన్, అమెరికా షరతులకు తలొగ్గకపోవడం ఆ దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం తన పంథాలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. చర్చలను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన పాకిస్థాన్ ప్రభుత్వానికి జేడీ వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి, ఆ దేశ సైన్యాధిపతి చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

Advertisment
తాజా కథనాలు