/rtv/media/media_files/2026/03/30/no-direct-talks-with-us-2026-03-30-16-25-46.jpg)
మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన '15 సూత్రాల ప్రతిపాదన' నీరుగారిపోయింది. ఈ ప్రతిపాదనలను ఇరాన్ ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా, ఇవి "అవాస్తవికమైనవి, అసమంజసమైనవి" అని కొట్టిపారేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. శాంతి చర్చల కోసం ట్రంప్ పంపిన 15 సూత్రాల నివేదికను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తోసిపుచ్చారు. వాషింగ్టన్ నుంచి అందిన ఈ షరతులు ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా, అమెరికాతో తాము ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపలేదని, సంప్రదింపులన్నీ కేవలం మధ్యవర్తుల ద్వారానే (ముఖ్యంగా పాకిస్థాన్ ద్వారా) జరిగాయని బఘాయీ స్పష్టం చేశారు.
ట్రంప్ 'డబుల్ గేమ్'.. ఇరాన్ వార్నింగ్
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంపై భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్ తమ షరతులకు అంగీకరించిందని ఆయన గతంలో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు మాట మార్చారు. "ఇరాన్ విషయంలో ఏం జరుగుతుందో చెప్పలేం.. మేము వారితో ఒకవైపు చర్చలు జరుపుతూనే, అవసరమైతే వారిని పేల్చివేయాల్సి వస్తుంది" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సైన్యం దీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా సైనికులు పర్షియన్ గల్ఫ్‌లోకి అడుగుపెడితే, వారు అక్కడి "సొరచేపలకు ఆహారంగా" మారుతారని హెచ్చరించింది. చర్చల పేరుతో అమెరికా కాలయాపన చేస్తూ దండయాత్రకు ప్లాన్ చేస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మండిపడ్డారు.
ఇరాన్ చమురు నిల్వలేనా?
అమెరికా సైన్యం ఇరాన్‌పై భూతల దండయాత్రకు ప్రణాళికలు రచిస్తోందన్న ఊహాగానాలు పెరిగాయి. 'వాషింగ్టన్ పోస్ట్' కథనం ప్రకారం, ఇది పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినప్పటికీ, ఇరాన్‌కు కీలకమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా హోర్ముజ్ జలసంధి వద్ద పరిమిత దాడులు చేయడంపై ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. "నిజం చెప్పాలంటే, ఇరాన్‌లోని చమురును తీసుకోవడమే నాకు ఇష్టమైన విషయం" అని ట్రంప్ అనడం ఆయన వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన మార్గాలు మూసుకుపోయి, యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Follow Us