/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-16-32-21.jpg)
Mosquito Fleet
Mosquito Fleet : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇరు దేశాలు సముద్ర వేదికగా సవాలు విసురుకుంటూ హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మార్గాన్ని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' పేరుతో వ్యూహాలు రచిస్తుంటే... అమెరికా తన జోక్యాన్ని పూర్తిగా నిలిపివేసే వరకు హోర్ముజ్ జలసంధిపై పట్టు వదిలే ప్రసక్తే లేదని ఇరాన్ భీష్మించుకు కూర్చుంది.ఈ ఆధిపత్య పోరులో అమెరికా వంటి అగ్రరాజ్య సైనిక బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సరికొత్త రక్షణ వ్యూహం 'మస్కిటో ఫ్లీట్' (Mosquito Fleet). తెలుగులో దీనిని 'దోమల దండు' అని పిలుస్తున్నారు. కేవలం సాంప్రదాయ యుద్ధ నౌకలపై ఆధారపడకుండా, ఇరాన్ సిద్ధం చేసిన ఈ వినూత్న నౌకాదళం ప్రస్తుతం పశ్చిమ దేశాల రక్షణ నిపుణులను ఆందోళనలోకి నెట్టేసింది.
అసలు ఏమిటీ 'మస్కిటో ఫ్లీట్'?
ఈ పేరు వినగానే నిజమైన దోమల సమూహం అనుకుంటే పొరపాటే. ఇది ఇరాన్ అధికారిక సైనిక విభాగం పేరు కూడా కాదు. ఇరాన్ తీరప్రాంత రక్షణ బలగాలు, ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఉపయోగిస్తున్న వందలాది చిన్న, అత్యంత వేగవంతమైన స్పీడ్ బోట్ల సమూహాన్ని పాశ్చాత్య రక్షణ నిపుణులు 'మస్కిటో ఫ్లీట్' అని పిలుస్తారు.దోమలు గుంపులుగా వచ్చి దాడి చేస్తే ఎంత విసుగు, ఇబ్బంది కలుగుతుందో... ఈ చిన్న పడవలు కూడా సముద్రంలో భారీ అమెరికన్ యుద్ధనౌకలను అలాగే చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే వీటికి ఈ పేరు సార్థకమైంది.
1980ల నాటి ఇరాక్ యుద్ధ కాలంలోనే ఇరాన్ ఈ వ్యూహానికి బీజం వేసింది. భారీ యుద్ధ నౌకలను నిర్మించడం కంటే, శత్రువుల కంటికి చిక్కని చిన్న చిన్న ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే లాభదాయకమని ఇరాన్ గ్రహించింది. ఈ వ్యూహంలో భాగంగానే వీటిని తయారు చేసింది.ఈ బోట్లు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండటం వల్ల శత్రువుల ఆధునిక రాడార్ వ్యవస్థలు వీటిని సులభంగా గుర్తించలేవు.ఇరాన్ వద్ద సుమారు 10 టన్నుల బరువుండే ఇటువంటి ఫాస్ట్ బోట్లు దాదాపు 1,500 వరకు సిద్ధంగా ఉన్నాయి.వందల మిలియన్ డాలర్ల ఖరీదైన అమెరికా యుద్ధ నౌకను నాశనం చేయడానికి, ఇరాన్ కేవలం కొన్ని వేల డాలర్ల విలువైన స్పీడ్ బోట్లను ఉపయోగిస్తుంది.
హోర్ముజ్ జలసంధి చాలా ఇరుకైన సముద్ర మార్గం. ఇక్కడ పెద్ద పెద్ద యుద్ధనౌకలు వేగంగా దిశను మార్చుకోవడం చాలా కష్టం. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఇరాన్ పలు రకాల ఆయుధాలతో దాడికి సిద్ధమైంది:
కామికేజ్ సూసైడ్ డ్రోన్లు
ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా నీటిపై ప్రయాణిస్తూ, సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తాయి. టార్గెట్‌ను గుర్తించిన వెంటనే నేరుగా వెళ్లి ఆ నౌకను ఢీకొట్టి పేలిపోతాయి. ఇటీవల జరిగిన ఒక దాడిలో అమెరికా నౌకను ఇటువంటి డ్రోన్ ఢీకొట్టడంతో ఒక భారతీయ నావికుడు కూడా మరణించాడు.
నిఘా, మైన్ క్లియరింగ్ డ్రోన్లు
ఇరాన్ కేవలం దాడులకే కాకుండా నిఘా కోసం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి అమెరికా యుద్ధ నౌకల కదలికలను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి. వీటితో పాటు సముద్రంలో పరచిన మైన్లను (మందుపాతరలను) గుర్తించి నిర్వీర్యం చేసే 'ఖైబర్' వంటి మైన్-క్లియరింగ్ డ్రోన్లు కూడా ఉన్నాయి.
మిసైల్ బోట్లు (క్షిపణి పడవలు)
ఇరాన్ వద్ద దాదాపు 300 మిసైల్ బోట్లు ఉన్నాయి. వీటిపై 'నాసర్', 'కౌసర్' వంటి షార్ట్ రేంజ్ సూపర్‌సోనిక్ గైడెడ్ క్షిపణులను అమర్చారు. ఇవి అతి సమీపం నుండి శత్రు నౌకలపై క్షిపణి వర్షం కురిపించగలవు.
అజదార్ (అండర్ వాటర్ వెహికల్)
ఇరాన్ బలగాల వద్ద 'అజదార్' అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ (సముద్ర గర్భంలో ప్రయాణించే వాహనం) ఉంది. ఇది నీటి అడుగున ప్రయాణిస్తుంది కాబట్టి, గగనతలం నుండి దీనిని గుర్తించి ధ్వంసం చేయడం అమెరికా దళాలకు దాదాపు అసాధ్యం.
సైనిక రక్షణ బడ్జెట్,సాంకేతికత పరంగా అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఈ మస్కిటో ఫ్లీట్ సవాలు మాత్రం దానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా గల్ఫ్ ప్రాంతానికి మూడు భారీ విమాన వాహక నౌకలను (Aircraft Carriers) పంపినప్పటికీ, హోర్ముజ్ జలసంధిలోకి వాటిని పంపడానికి సాహసించడం లేదు. ఇరుకైన జలసంధిలో ఈ భారీ నౌకలు మస్కిటో ఫ్లీట్ దాడికి సులభంగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ చిన్న బోట్లను, డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అత్యంత ఖరీదైన డిఫెన్స్ క్షిపణులను ప్రయోగించాల్సి వస్తోంది. ఇది వారి రక్షణ వ్యూహాల ఖర్చును ఊహించని రీతిలో పెంచేస్తోంది. ఈ చిన్న బోట్లు సాధారణ రవాణా పడవల రూపంలో ఉంటూ అకస్మాత్తుగా యుద్ధ బోట్లుగా మారి దాడి చేయగలవు. దీనివల్ల ఏది శత్రు బోటో, ఏది సాధారణ బోటో గుర్తించడం అమెరికా సైనికులకు కష్టంగా మారుతోంది.
భారీ ఆయుధాల కంటే సరైన వ్యూహమే యుద్ధ రంగంలో గెలుపును నిర్ణయిస్తుందని ఇరాన్ 'మస్కిటో ఫ్లీట్' నిరూపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళాన్ని సైతం బెంబేలెత్తిస్తూ, హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం అంత తేలికైన విషయం కాదని ఇరాన్ ఈ 'దోమల దండు' ద్వారా స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఈ సముద్ర సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Follow Us