మూడో ప్రపంచ యుద్దం అంచున అమెరికా-ఇరాన్.. క్షణం క్షణం ఏం జరుగుతుందొన్న భయం!

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందా?

New Update
America VS Iran

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోందో చూద్దాం.. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. ఒకవైపు ఒమన్‌ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు చర్చలు ప్రారంభం కాగా, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలోకి పంపడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 6న ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరపున డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ పాల్గొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ చర్చలను "మంచి ఆరంభం" అని అభివర్ణించినప్పటికీ, ఏం జరుగుతుందో అనే భయం మాత్రం ఇంకా వెంటాడుతుంది. 

ఉద్రిక్తతలకు కారణాలు:
అణు కార్యక్రమం: ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంను ఆయుధ తయారీకి అవసరమైన స్థాయిలో (60% పైగా) శుద్ధి చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అంతర్గత నిరసనలు: ఇరాన్‌లో ఇటీవలి కాలంలో జరిగిన నిరసనల అణిచివేతపై ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారులపై హింస కొనసాగితే సైనిక చర్య తప్పదని హెచ్చరించింది.
సైనిక మోహరింపు: చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాకు చెందిన USS అబ్రహం లింకన్ యుద్ధనౌక ఈ ప్రాంతానికి చేరుకోవడం, ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేయడం యుద్ధ భయాలను పెంచాయి.

అమెరికా దాడి చేస్తుందా?
ప్రస్తుతానికి అమెరికా పీస్ త్రూ స్ట్రెంత్ అనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అంటే చర్చలు విఫలమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ట్రంప్ వ్యాఖ్యానిస్తూ.. "చర్చలు బాగున్నాయి, కానీ ఒప్పందం కుదరకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి" అని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని టెహ్రాన్ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్ పాత్ర
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ వారంలోనే ట్రంప్‌తో భేటీ కానున్నారు. కేవలం అణు కార్యక్రమమే కాకుండా, ఇరాన్ క్షిపణులు, సాయుధ గ్రూపులపై కూడా ఆంక్షలు ఉండాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇరు దేశాలు యుద్ధం కంటే ఆర్థిక ఆంక్షలు, దౌత్య పరమైన ఒత్తిడితో తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాయి. అయితే, చిన్న పొరపాటు జరిగినా అది ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.

Advertisment
తాజా కథనాలు