/rtv/media/media_files/2026/05/17/aus-2026-05-17-12-49-34.jpg)
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగి అనే భారతీయ వ్యక్తికి అక్కడి స్థానిక కోర్టు 13 ఏళ్ల 10 నెలల భారీ జైలు శిక్ష విధించింది. ఒక మసాజ్ పార్లర్‌లో పనిచేస్తూ.. అక్కడకు వచ్చే మహిళా కస్టమర్లపై తీవ్రస్థాయి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వారిని రహస్యంగా వీడియోలు తీసినట్లు రస్తోగిపై రుజువైంది. మొత్తం 97 నేరాలకు గానూ ఆయనను దోషిగా తేలుస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది.
సుమిత్ రస్తోగికి మసాజ్ చేయడానికి ఎలాంటి అర్హత లేదా క్వాలిఫికేషన్ లేదు. అయినప్పటికీ ఆయన అడిలైడ్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో ఉద్యోగం సంపాదించాడు. అక్టోబర్ 2021 నుండి జూలై 2022 మధ్య కాలంలో తన వద్దకు మసాజ్ కోసం వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. మసాజ్ నెపంతో మహిళల ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, వారి ప్రమేయం లేకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ దారుణాల్లో మొత్తం 61 మంది మహిళలు బాధితులుగా మారారు.
రస్తోగికి మానసిక సమస్య
విచారణ సమయంలో రస్తోగికి మానసిక సమస్య ఉందనే కోణాన్ని కూడా కోర్టు పరిశీలించింది. నిందితుడిని పరీక్షించిన సైకియాట్రిస్ట్.. అతడికి ఎదుటివారికి తెలియకుండా వారి నగ్నత్వాన్ని లేదా ప్రైవేట్ క్షణాలను చూసి లైంగిక ఆనందం పొందే ఒక రకమైన మానసిక వికృతి ఉందని నిర్ధారించారు.
దీనిపై జడ్జ్ స్పందిస్తూ.. "నీకున్న మానసిక రుగ్మత నీ నేరపూరిత ప్రవర్తనకు ఒక వివరణ ఇవ్వగలదేమో కానీ, చేసిన తప్పు నుండి నిన్ను రక్షించలేదు. నువ్వు చేస్తున్నది తప్పని నీకు బాగా తెలుసు, అలాగే నీ ప్రవర్తనను నువ్వు నియంత్రించుకోగల స్థితిలోనే ఉన్నావు" అని స్పష్టం చేస్తూ శిక్ష ఖరారు చేశారు.
సుమిత్ రస్తోగికి విధించిన 13 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం పూర్తిగా ముగిసిన తర్వాత.. అతడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించనుంది.జైలు నుండి విడుదలైన వెంటనే అతడిని తిరిగి ఇండియాకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow Us