Indian-origin pilot : పచ్చని పందిట్లో మృత్యుఘోష: పెళ్లయిన కొద్ది గంటలకే..భారతసంతతి పైలట్‌ మృతి

జీవితాంతం కలిసి నడవాలంటూ ఆ దంపతులు వేసిన ఏడడుగుల బంధం పట్టుమని పది గంటలైనా గడవలేదు. నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ దంపతుల జీవితంలోకి మృత్యువు హెలికాప్టర్ ప్రమాద రూపంలో దూసుకొచ్చి, పెళ్లి పీటల నుంచి నేరుగా చితిపైకి నెట్టింది.

New Update
FotoJet (94)

Groom dies in helicopter crash

Indian-origin pilot : అప్పటివరకు ఆ కల్యాణ వేదిక వందలాది మంది బంధుమిత్రుల కోలాహలంతో, నూతన వధూవరుల నవ్వులతో ఎంతో వైభవంగా శోభిల్లింది. జీవితాంతం కలిసి నడవాలంటూ ఆ దంపతులు వేసిన ఏడడుగుల బంధం పట్టుమని పది గంటలైనా గడవకముందే.. విధి ఆడిన వింత నాటకంలో ఒక ఘోర విషాదంగా ముగిసింది. నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ దంపతుల జీవితంలోకి మృత్యువు హెలికాప్టర్ ప్రమాద రూపంలో దూసుకొచ్చి, పెళ్లి పీటల నుంచి నేరుగా చితిపైకి నెట్టింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానిక ప్రవాస భారతీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా మువట్టుపుజ ప్రాంతం నుంచి కొన్నేళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి అట్లాంటాలో స్థిరపడిన జార్జ్, ఫీబా దంపతుల కుమారుడు డేవ్ ఫైజీ (25). అమెరికాలోని ప్రముఖ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో కమర్షియల్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. డేవ్ ఫైజీకి, కేరళలోని ఆలప్పుజ జిల్లాతో అనుబంధం ఉన్న కుటుంబానికి చెందిన జెస్ని అనే యువతితో మే 29న వివాహం జరిగింది. జార్జియాలోని డాసన్‌విల్లే సమీపంలో ఉన్న 'ది రివెరె' వెడ్డింగ్ హాల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహ వేడుక అత్యంత అంగరంగ వైభవంగా ముగిసింది. అనంతరం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ కొత్త జంట అట్లాంటా డౌన్‌టౌన్‌లోని ఒక హోటల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్‌లో ప్రయాణమయింది.

అయితే, ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రతికూలంగా మారాయి. దట్టమైన పొగమంచు, భారీ వర్షం కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) పూర్తిగా పడిపోయింది. స్వయంగా ఒక కమర్షియల్ పైలట్ అయిన డేవ్.. ఈ ప్రమాదకర వాతావరణాన్ని గమనించి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించడం సురక్షితం కాదని, ఇప్పుడు టేకాఫ్ వద్దు అని తన తండ్రికి కూడా స్పష్టంగా చెప్పాడు. కానీ, ప్రైవేట్ రాబిన్సన్ R66 హెలికాప్టర్‌ను నడుపుతున్న ప్రధాన పైలట్.. వాతావరణం బాగోలేకపోయినా ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మబలికాడు. దాంతో డేవ్ వాతావరణ ముప్పుపై ఆందోళన చెందుతూనే, పైలట్ మాట నమ్మి రాత్రి 10:30 గంటల సమయంలో భార్యతో కలిసి హెలికాప్టర్ ఎక్కాడు.

తీరా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. డాసన్‌విల్లే నైరుతి దిశలోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతంలో ఆ హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయింది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమై చెట్ల మధ్య పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వరుడు డేవ్ ఫైజీతో పాటు హెలికాప్టర్ నడిపిన ప్రధాన పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వధువు జెస్ని మాత్రం శరీరమంతా తీవ్ర గాయాలతో, విరిగిపోయిన చెట్లు మరియు హెలికాప్టర్ శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ నిర్మానుష్య అడవిలో, గాఢాంధకారంలో దాదాపు ఐదు గంటల పాటు ఆమె నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలతో కొట్టుమిట్టాడింది.

ఈ భయానక రాత్రి గురించి డేవ్ తండ్రి జార్జ్ ఫైజీ కన్నీరుమున్నీరవుతూ గుర్తుచేసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పృహలోకి వచ్చిన జెస్నికి.. తన చుట్టూ భీతావహమైన అడవి, శిథిలాలు మాత్రమే కనిపించాయి. తీవ్ర గాయాల పాలైనప్పటికీ వృత్తిరీత్యా నర్సు అయిన జెస్ని.. తనపై పడిపోయి ఉన్న భర్త డేవ్‌ను లేపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే అతని నాడిని పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి షాక్‌లోకి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడం, సరైన దారి లేకపోవడంతో సమాచారం అందడం కష్టమైంది. చివరకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఆఫ్‌రోడ్ వాహనాల సాయంతో 6 గంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జెస్ని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నప్పటికీ, కళ్లెదుటే భర్తను కోల్పోవడంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురై కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘోర ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ పైలట్ హెలికాప్టర్‌ను ఎందుకు టేకాఫ్ చేయాల్సి వచ్చింది, విమానయాన భద్రతా నియమాలను ఉల్లంఘించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 30 రోజుల్లోగా విడుదల చేస్తామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు