/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-20-31-20.jpg)
FTA : ప్రపంచ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారత్,న్యూజిలాండ్ దేశాలు తమ ఆర్థిక బంధాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా కీలక అడుగు వేశాయి. సోమవారం ఇరు దేశాల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఏడాది చివరి నుంచి అమలులోకి రానున్న ఈ ఒప్పందం, రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది.
భారతీయ ఉత్పత్తులకు భారీ ఊతం
ఈ ఎఫ్‌టీఏ (FTA) వల్ల న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే 100 శాతం భారతీయ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ (సుంకం) పూర్తిగా రద్దు కానుంది. గతంలో ఆటోమొబైల్స్, కార్పెట్లు, సెరామిక్స్ వంటి వస్తువులపై న్యూజిలాండ్ 10 శాతం వరకు టారిఫ్ విధించేది. ఇకపై ఇవి సున్నా సుంకంతో ఆ దేశంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్లటెక్స్‌టైల్స్, ఫ్యాషన్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు చౌకగా మారుతాయి.రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ గూడ్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎగుమతులు పెరుగుతాయి.ముఖ్యంగా భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మార్కెట్ లభిస్తుంది, ఫలితంగా భారీగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
భారత పరిశ్రమలకు కలిసొచ్చే అంశాలు
ఒప్పందం ప్రకారం భారత్ సుమారు 70 శాతం ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించింది. వీటిలో మన దేశ తయారీ రంగానికి అవసరమైన ముడి పదార్థాలు ఉండటం విశేషం. ఉడెన్ లాగ్స్, లోహ వ్యర్థాలు (Scrap), కోకింగ్ కోల్ వంటి వస్తువులు సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశంలో ఉత్పత్తి వ్యయం తగ్గి, దేశీయ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది.
సున్నిత రంగాలకు పటిష్ట రక్షణ
వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే, మన దేశంలోని సున్నితమైన రంగాలను దెబ్బతినకుండా భారత్ జాగ్రత్త పడింది. దాదాపు 30 శాతం ఉత్పత్తులపై పన్నులను యథాతథంగా ఉంచింది.డైరీ,అగ్రికల్చర్: పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో పాటు ఉల్లిపాయలు, శెనగలు, బాదం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను మినహాయింపు ఇవ్వలేదు.చిన్న పరిశ్రమలు, ఆయుధాలు, అల్యూమినియం, రాగి వంటి లోహాల అనుబంధ ఉత్పత్తులపై కూడా దేశీయ పరిశ్రమల ప్రయోజనాల దృష్ట్యా టారిఫ్ తగ్గించలేదు.
న్యూజిలాండ్ భారీ పెట్టుబడులు - 20 బిలియన్ డాలర్ల ప్లాన్
ఈ ఒప్పందంలో భాగంగా న్యూజిలాండ్ రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.88 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు పెట్టనుంది. పెట్టుబడుల విషయంలో ఏదైనా వ్యత్యాసాలు వస్తే పరిష్కరించుకోవడానికి ప్రత్యేకంగా 'రీబ్యాలెన్సింగ్ క్లాజ్'ను కూడా ఒప్పందంలో చేర్చారు.
సేవా రంగం,నిపుణులకు వరప్రసాదం
కేవలం వస్తువుల మార్పిడికే పరిమితం కాకుండా, సేవా రంగానికి కూడా ఈ ఒప్పందం పెద్దపీట వేసింది. ఐటీ, హెల్త్‌కేర్, విద్య మరియు ఇంజనీరింగ్ రంగాల్లోని భారతీయ నిపుణులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు మరింత సులభం కానున్నాయి. తాత్కాలిక వర్క్ వీసాలు, ప్రొఫెషనల్ మొబిలిటీ వంటి అంశాల్లో సరళీకరణ వల్ల రెండు దేశాల మధ్య మానవ వనరుల మార్పిడి వేగవంతం కానుంది.మొత్తానికి, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్-న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, పసిఫిక్ ప్రాంతంలో భారత్ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత బలపరుస్తుంది. దీనివల్ల అటు వ్యాపారవేత్తలకు, ఇటు సామాన్య నిపుణులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగనున్నాయి.
Follow Us