/rtv/media/media_files/2026/04/19/pakistan-2026-04-19-19-47-43.jpg)
pakistan
Pakistan : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ,రావల్పిండి నగరాల్లో ప్రస్తుతం ఒక హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అమెరికా ,ఇరాన్ దేశాల మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందనే వార్తల నేపథ్యంలో, పాక్ యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని సూచిస్తున్నాయి. వీధుల్లో భారీగా పోలీసుల మోహరింపు, భవనాల పైకప్పులపై స్నైపర్లు, బస్ స్టేషన్ల మూసివేత, విలాసవంతమైన ఫైవ్-స్టార్ హోటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వంటివి కనిపిస్తున్నాయి.
ఒమన్ రాయబార కార్యాలయం వద్ద భద్రత
ఇదే సమయంలో ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒమన్ రాయబార కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచడం గమనార్హం. ఇటలీ రాజధాని రోమ్‌లో కూడా ఇలాంటి సన్నాహాలే జరుగుతున్నాయి. రోమ్‌లోని ఒమన్ రాయబార కార్యాలయం వెలుపల భద్రతను అత్యంత అప్రమత్తంగా ఉంచారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలలో ఒమన్ కూడా ఒకటి. ఇస్లామాబాద్‌తో పాటు రోమ్‌లో కూడా సమాంతరంగా చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
హోటల్ మారియట్ లో చర్చలు
ఈ పరిణామాల్లో భాగంగా, ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ 'మారియట్' గదులను ఖాళీ చేయాలని అతిథులకు ఆకస్మిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు తమ గదులను ఖాళీ చేయాలని అతిథులకు స్పష్టంగా సూచించారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరో ప్రముఖ హోటల్ 'సెరెనా' కూడా ముందస్తు బుకింగ్‌లన్నింటినీ నిలిపివేసింది. అక్కడ గది బుక్ చేసుకోవడానికి జర్నలిస్టులు సంప్రదించినప్పుడు, రాబోయే కొద్ది రోజులకు గదులు అందుబాటులో లేవని వారికి నిర్మొహమాటంగా చెప్పారు.
ప్రజా రవాణాపై నిషేధం
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో ప్రజా రవాణా, సరుకు రవాణాను యంత్రాంగం పూర్తిగా నిలిపివేసింది. గురువారం రాత్రి సుమారు 11 గంటల నుండి, యంత్రాంగం పోలీసుల సహాయంతో ఫైజాబాద్, పిర్ వధాయ్, మండి మోర్,నంబర్ 26 టోల్ వంటి ప్రధాన బస్ స్టాప్‌లను మూసివేయడం ప్రారంభించింది. దీని ప్రభావంతో ఆ రెండు నగరాల్లోనూ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపించింది.ఇస్లామాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెడ్ జోన్ ప్రాంతంలో అన్ని రకాల వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేశారు. కేవలం మార్గల్లా రోడ్డులోని ఒక ప్రవేశ మార్గం మాత్రమే తెరిచి ఉంది, అది కూడా ప్రభుత్వ వాహనాలకు మాత్రమే. శ్రీనగర్ హైవేపై కూడా ట్రాఫిక్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
10,000 మందితో పటిష్ట భద్రత...
భద్రత కోసం దాదాపు 10,000 మంది పోలీసులను, 400 మంది ఎలైట్ కమాండోలను, 100 మంది స్నిపర్లను రంగంలోకి దించారు. నగరంలోని ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించడానికి ఆరు వందలకు పైగా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై అదనపు బలగాలను మోహరించారు. పంజాబ్ హైవే పెట్రోల్‌కు చెందిన నాలుగు వేల మంది సైనికులు, డాల్ఫిన్ ఫోర్స్‌కు చెందిన రెండు వందల మంది సాయుధ సైనికులను మోహరించారు.విదేశీ ప్రతినిధులు దిగే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పరిసరాల్లో కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడమే కాకుండా, పోలీసులు ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, హాస్టళ్లు, గెస్ట్ హౌస్‌లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులకు మొగ్గు చూపుతుండగా, మతపరమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోంది.
నగరంలో పోలీసులు-సైన్యం గాలింపు
'ది డాన్' కథనం ప్రకారం, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు విదేశీ అతిథులు రావడం వల్ల, ఎయిర్‌బేస్ చుట్టూ ఉన్న అన్ని నివాస సముదాయాలలో కర్ఫ్యూ లాంటి పరిస్థితిని విధించారు. వీధుల్లో భారీగా పోలీసులను మోహరించారు, మరియు నివాసితులను బయట తిరగకుండా జాగ్రత్త పడమని కోరారు. సమీపంలోని మార్కెట్లను మూసివేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనబడితే తక్షణ చర్యలు తీసుకునేలా, భవనాల పైకప్పులపై ఉన్న స్నైపర్లు, నేలపై ఉన్న పోలీసులతో నిరంతరం వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తారు. భద్రతా సిబ్బందిని షిఫ్టులుగా విభజించారు, దీని ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 3600 మంది పోలీసు సిబ్బంది, ఆ తర్వాతి షిఫ్టులో 3500 మంది విధుల్లో ఉంటారు. మరోవైపు పోలీసులు నగరం మొత్తం గాలిస్తున్నారు. ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, నగరం అంతటా భారీ 'గ్రాండ్ కమింగ్ సెర్చ్ ఆపరేషన్' నిర్వహిస్తున్నారు. థానా కర్పా, సంబల్, సెక్రటేరియట్, ఖన్నా, ఇండస్ట్రియల్ ఏరియా, బని గాలా మరియు టర్నోల్ వంటి ప్రాంతాలలో పోలీసులు ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు, 712 మందిని అదుపులోకి తీసుకున్నారు.1,108 ఇళ్లను తనిఖీ చేశారు. 182 దుకాణాలు,32 హోటళ్లలో సోదాలు నిర్వహించారు.
భద్రతా బృందాల రాక
అమెరికా, ఇరాన్ దేశాల అడ్వాన్స్ సెక్యూరిటీ టీమ్స్ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఒకవేళ ఈ శాంతి చర్చలు సఫలమైతే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాకిస్థాన్‌ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచంలోని ఇద్దరు బద్ధ శత్రువుల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ రాజధాని నగరం అక్షరాలా ఒక సైనిక కోటగా మారిపోయింది. ఈ చర్చల ఫలితం ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఇస్లామాబాద్‌పైనే ఉంది. అందుకే పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Follow Us