/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
US firing
America: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ ఘోర ఘాతుకానికి దారితీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయోవా (Iowa) రాష్ట్రంలోని మస్కటీన్ (Muscatine) నగరంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర కలికలం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనతో మస్కటీన్ నగరం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
మస్కటీన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 210 పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇంటిలోపల నలుగురు వ్యక్తులు తుపాకీ తూటాల గాయాలతో రక్తపుమడుగులో పడివున్నారు. అప్పటికే వారంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని మస్కటీన్‌కే చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్లాండ్ (Ryan Willis McFarland) గా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన రక్షణ విభాగాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా.. కాల్పులు జరిగిన గంట వ్యవధిలోనే నదీతీరంలోని రివర్‌ఫ్రంట్ ట్రైల్ వద్ద గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో అతడిని గుర్తించారు. పోలీసులు అతడిని లొంగిపోవాలని హెచ్చరిస్తుండగానే, నిందితుడు ర్యాన్ విల్లిస్ తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులకు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ బాధితులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1500 బ్లాక్ మిల్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో ఒకరి మృతదేహాన్ని, అలాగే 808 గ్రాండ్‌వ్యూ అవెన్యూలో ఉన్న 'విల్లిట్స్ మెటల్‌వర్క్స్' అనే వ్యాపార సంస్థలో మరో వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ రెండు చోట్లా కూడా నిందితుడే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇంట్లో మరణించిన నలుగురు, బయట వేర్వేరు ప్రాంతాల్లో మరణించిన ఇద్దరు.. మొత్తం ఆరుగురు బాధితులు నిందితుడి కుటుంబ సభ్యులేనని పోలీసులు వెల్లడించారు. కుటుంబ వివాదాలే ఈ సామూహిక హత్యలకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బాధితుల పూర్తి వివరాలను, వారి గుర్తింపును మిగిలిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. నిందితుడితో కలిపి ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు.
ఈ ఘోర ఉదంతం నేపథ్యంలో మస్కటీన్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత, విషాద ఛాయలు అలముకున్నాయి. పార్క్ అవెన్యూ, నదీతీర పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా నిర్బంధించి పసుపు రంగు క్రైమ్ టేపులతో మూసివేశారు. ప్రజలు ఎవరూ ఆయా ప్రాంతాలకు రావొద్దని కౌంటీ అత్యవసర నిర్వహణ విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మస్కటీన్ పోలీస్ విభాగంతో పాటు కౌంటీ షెరీఫ్ కార్యాలయం, అయోవా స్టేట్ పెట్రోల్, డివిజన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా ఈ కేసును విచారిస్తున్నాయి.
Follow Us