/rtv/media/media_files/2026/05/08/putin-2026-05-08-20-53-46.jpg)
. Putin'
Russia : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రతిపాదనలు చేశారు. సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా సంస్థల అధినేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానమైన సుఖోయ్ సు-57 (Su-57) అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేవలం విక్రయించడమే కాకుండా, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు మద్దతుగా ఈ యుద్ధ విమానాలను భారత్‌లోనే ఇరుదేశాలూ ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పుతిన్ స్పష్టం చేయడం విశేషం.
భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలపై స్పందిస్తూ, ఈ రెండు పొరుగు దేశాల అంతర్గత, ద్వైపాక్షిక వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకోబోదని పుతిన్ తేల్చిచెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు చాలా బాధ్యతాయుతమైన నాయకులని, వారి మధ్య ఉన్న సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోగలరనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య బంధం చాలా సున్నితమైనదని, ఇందులో మూడో పక్షం ప్రమేయం శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా-భారత్ ల మధ్య దశాబ్దాలుగా ఉన్న బలమైన స్నేహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాశ్చాత్య దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయని పుతిన్ ఆరోపించారు. అయితే, ఇరుదేశాల మధ్య బంధాన్ని దెబ్బతీయడం వల్ల అంతర్జాతీయ సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని, పాశ్చాత్య దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగిపోయే వ్యక్తిత్వం ఆయనది కాదని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు.
తన రాజకీయ భవిష్యత్తు,అధికార కాలంపై వచ్చిన ఓ ప్రశ్నకు పుతిన్ ఆసక్తికరంగా స్పందించారు. 2024లో ఆరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, తదుపరి ఎన్నికలు 2030లో జరగాల్సి ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. రష్యా రాజ్యాంగం ప్రకారం తాను 2036 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, అంతకాలం పదవిలో ఉంటానా లేదా అన్నది "ఆ దేవునికే ఎరుక" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి భవిష్యత్తు ఎన్నికల గురించి కాకుండా, తక్షణ బాధ్యతలపైనే దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు.
Follow Us