Iran Us War : ఇరాన్‌లో పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన 14 మంది సభ్యులు మరణించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది.

New Update
FotoJet - 2026-04-20T131519.934

IRGC

Iran Us War : ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన 14 మంది సభ్యులు మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది. వాయువ్య ఇరాన్‌లోని జంజాన్ సమీపంలో ఉన్న ఒక కలుషిత ప్రాంతంలో యుద్ధ అవశేషాలను తొలగించే పనిలో ఉన్న ఐఆర్‌జీసీ డెమోలిషన్ టీమ్ లక్ష్యంగా ఈ పేలుడు సంభవించింది.

ఈ ప్రాంతం ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో శత్రు దేశాల వైమానిక దాడులకు గురైందని, ఆ సమయంలో జారవిడిచిన క్లస్టర్ బాంబులు (Cluster Bombs), ఎయిర్‌మైన్లు (Air Mines) ఈ ఘోర ప్రమాదానికి కారణమని ఐఆర్‌జీసీకి చెందిన అన్సార్ అల్-మహ్దీ విభాగం ప్రకటించింది. మరణించిన వారంతా బాంబులను నిర్వీర్యం చేయడంలో అత్యంత అనుభవం కలిగిన నిపుణులని సమాచారం. సుమారు 1,200 హెక్టార్ల వ్యవసాయ భూముల్లో బాంబు అవశేషాలు వ్యాపించి ఉన్నాయని, వాటిని శుభ్రం చేసే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఏప్రిల్ 8న ఇరాన్  అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య కాల్పుల విరమణ (Ceasefire) అమల్లోకి వచ్చిన తర్వాత ఐఆర్‌జీసీ దళాలకు జరిగిన అతిపెద్ద నష్టం ఇదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుద్ధం ముగిసినప్పటికీ, భూమిలో ఉండిపోయిన బాంబులు సామాన్య పౌరులకు సైనిక బలగాలకు పెను సవాలుగా మారాయి. ఇప్పటివరకు ఐఆర్‌జీసీ బృందాలు సుమారు 15,000కు పైగా పేలని బాంబులను నిర్వీర్యం చేసినప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముప్పు పొంచే ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, పౌర నివాసాల సమీపంలో ఇటువంటి నిషేధిత క్లస్టర్ బాంబులను ఉపయోగించడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కొన్ని దశాబ్దాల పాటు ముప్పుగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో క్లీనింగ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు