Elon Musk Trilinear : కోటి కోట్ల మస్క్.. ప్రపంచపు తొలి 'మహాక్షోణాధిపతి' దిశగా ఎలోన్ అడుగులు!

అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఆధునిక మానవ చరిత్రలోనే ఎవరూ ఊహించని, అందుకోలేని ఒక అద్భుతమైన మైలురాయి దిశగా వేగంగా దూసుకుపోతున్నారు. లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటడం ద్వారా ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (Trillionaire) కానున్నారు.

New Update
Elon Musk 3

Elon Musk

Elon Musk Trilinear : అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఆధునిక మానవ చరిత్రలోనే ఎవరూ ఊహించని, అందుకోలేని ఒక అద్భుతమైన మైలురాయి దిశగా వేగంగా దూసుకుపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను లెక్కించే ప్రముఖ 'ఫోర్బ్స్' గణాంకాల ప్రకారం.. మస్క్ ఆస్తుల నికర విలువ మన కరెన్సీలో ఇప్పటికే రూ. 75 లక్షల కోట్లకు పైమాటే! దీనికి తోడు ఇన్నాళ్లూ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఆయన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ (SpaceX) ఈ జూన్ 12న ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సంస్థలో మస్క్‌కు 50 శాతానికి పైగా వాటా ఉంది. ఈ ఐపీవో ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన మొత్తం సంపద 1.11 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.

లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటడం ద్వారా ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (Trillionaire) కానున్నారు. మన భారతీయ రూపాయల లెక్కలో చెప్పాలంటే ఆయన ఆస్తి ఏకంగా 'కోటి కోట్ల రూపాయల' మార్కును దాటేస్తుంది. ఇంగ్లిష్‌లో ఈ సంఖ్యకు ప్రత్యేక పదం లేకపోవడంతో జస్ట్ 'మల్టీ ట్రిలియనీర్' అని సరిపెట్టుకోవాలి. కానీ, మన ప్రాచీన సంస్కృత సంఖ్యా మానం ప్రకారం చూస్తే.. లక్ష కోట్లను ‘మహాపద్మం’ అని, పది లక్షల కోట్లను ‘క్షోణి’ అని, వంద లక్షల కోట్లను (అంటే కోటి కోట్లను) ‘మహాక్షోణి’ అని పిలుస్తారు. ఈ లెక్కన చూస్తే మస్క్‌ను ప్రపంచపు తొలి ‘మహాక్షోణాధిపతి’గా అభివర్ణించవచ్చు.

మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందో అర్థం కావడానికి కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ దేశాల వార్షిక జీడీపీ (GDP) కంటే మస్క్ ఒక్కడి ఆస్తే ఎక్కువ. ప్రపంచ అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండే జెఫ్ బెజోస్ (అమెజాన్), లారీ ఎల్లిసన్ (ఒరాకిల్), లారీ పేజ్, సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకులు)ల ఆస్తులన్నీ కలిపితే కానీ ట్రిలియన్ డాలర్ల మార్కు దాటదు. అలాంటిది మస్క్ ఒక్కడి సంపదే ఆ స్థాయికి చేరుతోంది. ఆయన నివసిస్తున్న అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువను కలిపినా కూడా మస్క్ సంపద కంటే తక్కువే కావడం విశేషం. ప్రపంచంలోని టాప్-50 స్పోర్ట్స్ టీమ్స్ మొత్తం విలువైన 353 బిలియన్ డాలర్లను ఆయన ఎడంచేత్తో కొనేయగలరు. ఒక మిలియన్ డాలర్లంటే మనకు దాదాపు రూ. 9.5 కోట్లు. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున, రోజుకు 24 గంటలూ ఏడాది పొడుగునా రూపాయి ఆదాయం రాకుండా ఖర్చు పెడుతూ పోయినా.. మస్క్ సంపద కరగడానికి 100 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది!

వ్యాపార సామ్రాజ్యంలో ఇలాంటి అసాధారణ విజయాలు అందుకుంటున్న మస్క్.. మరోవైపు సామాజిక, జనాభా పరిణామాలపై కూడా అంతే నిశితంగా స్పందిస్తుంటారు. తాజాగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) వేగంగా పడిపోతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సంతానోత్పత్తి రేటు పునరుత్పత్తి (రీప్లేస్‌మెంట్) స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. "భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ప్రమాదకరంగా క్షీణించింది. ముఖ్యంగా బాగా చదువుకున్న వర్గాల్లో ఈ రేటు ఎన్నో ఏళ్ల క్రితమే పడిపోయింది" అని మస్క్ వ్యాఖ్యానించారు.

'ది ఎకనామిస్ట్' పత్రిక మరియు 'ఏఎఫ్ పోస్ట్' మీడియా సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా సంతానోత్పత్తి రేటు ఇంతలా క్షీణించింది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే దేశ సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి పడిపోయింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు ఏకంగా 1.2గా నమోదైంది. ఇది యూరప్ దేశమైన ఫిన్లాండ్ కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదిక కూడా భారత్‌లో సగటు సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయిందని అధికారికంగా స్పష్టం చేసింది.

సాధారణంగా ఒక తరం తర్వాత వచ్చే తరం నాటికి దేశంలో జనాభా సమతుల్యత దెబ్బతినకుండా, స్థిరంగా ఉండాలంటే పునరుత్పత్తి రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ ప్రస్తుతం భారత్‌లో ఈ రేటు 1.9కి పడిపోవడం అంటే, జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన దానికంటే భారతీయ మహిళలు సగటున తక్కువ మంది పిల్లలను కంటున్నారని అర్థం. యువ జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా దూసుకుపోతున్న భారత్‌లో.. ఈ రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జనాభా వేగంగా తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ఎలోన్ మస్క్‌తో పాటు అంతర్జాతీయ జనాభా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు