Donald Trump : చైనాకు ట్రంప్ వార్నింగ్: ఇరాన్‌కు ఆయుధాలిచ్చారో.. ఇక మీ పని ఖతం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై సైనిక విజయం సాధించామనే ధీమాను వ్యక్తం చేశారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై సైనిక విజయం సాధించామనే ధీమాను వ్యక్తం చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ప్రకటించారు. "ప్రస్తుతం ఇరాన్ వద్ద నౌకాదళం లేదు, రాడార్లు లేవు, కనీసం వైమానిక దళం కూడా లేదు. వారి నాయకులంతా అంతమైపోయారు. ఏళ్ల తరబడి పాలించిన వారు ఇప్పుడు లేరు. ఏం జరుగుతుందో చూద్దాం.. కానీ నా దృష్టిలో ఇరాన్ గురించి నాకు పట్టింపు లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ చైనా గనుక ఇరాన్‌కు ఆయుధాలు పంపితే, ఆ దేశం భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "చైనా ఆ పని చేస్తే, వారికి పెద్ద సమస్యలు తప్పవు" అని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధంలో మేమే గెలిచాం

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రస్తుతం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్ ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఈ చర్చల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. "వారు గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అమెరికాకు వచ్చే నష్టం ఏమీ లేదు. యుద్ధంలో మేమే గెలిచాం. మా చమురు నౌకలు నిండుగా సముద్రంలో ప్రయాణిస్తున్నాయి. మేమే విజేతలం" అని ఉద్ఘాటించారు.

ఇరాన్ ఆస్తుల విడుదలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. నాటో సాయం లేకుండానే తాము ఇరాన్‌ను సైనికంగా ఓడించామని, హార్ముజ్ జలసంధిపై ప్రస్తుతం తమ పట్టు ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. దాదాపు నెల రోజులుగా సాగిన తీవ్ర సైనిక పోరు తర్వాత, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.

Advertisment
తాజా కథనాలు