/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-12-21-56.jpg)
Death penalty for Iranian women... Donald Trump enters the fray.
Donald Trump :ఇరాన్ జైళ్లలో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్న తరుణంలో, ఇరాన్ జైళ్లలో బందీలుగా ఉన్న ఎనిమిది మంది మహిళల అంశం తెరపైకి వచ్చింది. ఇరాన్ ప్రభుత్వం వీరికి మరణశిక్ష విధించినట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సదరు మహిళల చిత్రాలను పంచుకుంటూ, వారిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
"దయచేసి ఆ మహిళలకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. త్వరలోనే అమెరికా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపబోతున్న ఇరాన్ నాయకులకు నేను ఒకటే కోరుతున్నాను.. మీరు గనుక ఆ మహిళలను విడుదల చేస్తే, నేను దానిని ఎంతో అభినందిస్తాను. ఇది మన మధ్య జరగబోయే చర్చలకు ఒక గొప్ప ఆరంభం అవుతుంది" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అయితే, మరోవైపు ఇరాన్ అటార్నీ జనరల్ ఈ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష విధించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చినట్లు బిబిసి (BBC) పేర్కొంది.
ఎవరీ 8 మంది మహిళలు?
మానవ హక్కుల కార్యకర్త ఇయాల్ యాకోబి మరియు లాఫేర్ ప్రాజెక్ట్ నివేదికల ప్రకారం, ఈ మహిళల వివరాలు వారిపై ఉన్న ఆరోపణలు ఇలా ఉన్నాయి.
బీతా హెమ్మతీ : ప్రభుత్వంపై నిరసనలు చేసినందుకు జనవరిలో భర్తతో సహా అరెస్ట్ అయ్యారు. పేలుడు పదార్థాల వాడకం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి.
డయానా తాహెర్ అబాదీ16 ఏళ్లు: నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణతో జనవరిలో అదుపులోకి తీసుకున్నారు.
మెహబూబే షబానీ33 ఏళ్లు : నిరసనల్లో గాయపడిన వారికి చికిత్స అందించారనే ఆరోపణతో ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు.
ఎన్సియే నెజాతీ : కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త. ఈమెకు ఒక చిన్న బాబు ఉన్నాడు. 2025 ప్రారంభంలో ఈమెకు మరణశిక్ష విధించినట్లు సమాచారం.
గోల్నాజ్ నరాఘీ 37 ఏళ్లు : వృత్తిరీత్యా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్. నిరసనల సమయంలో ఈమెను అరెస్ట్ చేశారు.
వీనస్ హుస్సేన్ నెజాద్: తన ఆఫీసు నుండే సెక్యూరిటీ ఫోర్స్ ఈమెను అరెస్ట్ చేసింది. ప్రభుత్వ టీవీలో బలవంతంగా తప్పు ఒప్పుకోలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
గజల్ గలందరి : మానవ హక్కుల సంఘాల జాబితాలో ఉన్నారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పనాహ్ మోవాహేదీ : మానవ హక్కుల సంఘాల జాబితాలో ఉన్నారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇరాన్ యంత్రాంగం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ, కార్యకర్తల సమాచారం ప్రకారం వీరిపై ప్రధానంగా పలు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించడం.దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం.నిరసనకారులకు, గాయపడిన వారికి సహకరించడం. ఈ మహిళల చిత్రాలను వారి మరణశిక్ష వార్తలను మొట్టమొదటగా ఆన్‌లైన్‌లో షేర్ చేసింది అయాల్ యాకోబి. ఇతను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా గ్రాడ్యుయేట్. ఇరాన్ ప్రభుత్వం ఈ మహిళలను ఉరి తీయాలని ప్లాన్ చేస్తోందని, అంతర్జాతీయ సమాజం దీనిపై మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ జోక్యంతో ఈ విషయం ఒక అంతర్జాతీయ దౌత్య అంశంగా మారింది. అమెరికాతో తిరిగి చర్చలు ప్రారంభించాలనుకుంటున్న ఇరాన్, ట్రంప్ విజ్ఞప్తికి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow Us