/rtv/media/media_files/2026/03/14/iran-2026-03-14-21-18-46.jpg)
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండు వారాలుగా సాగుతున్న యుద్ధం శనివారం రాత్రికి పరాకాష్టకు చేరుకుంది. ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర, వైద్య సేవల సంస్థ మాగెన్ డేవిడ్ అడోమ్ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఉత్తర, దక్షిణ మధ్య ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ ఏకంగా 1,430 క్షిపణులతో విరుచుకుపడింది.
ఈ దాడుల్లో ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఈలట్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ బాంబుల ధాటికి నగరం చుట్టుపక్కల అనేక చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ జరిగిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, శరీరమంతా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. మరో 39 ఏళ్ల వ్యక్తి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ యోసెఫ్తల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు గాలిలోనే చాలా క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, నిమిషాల్లో వందల సంఖ్యలో మిస్సైళ్లు రావడం వల్ల పెను నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగడంతో ప్రజలు బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు. గత 24 గంటల్లోనే ఇరాన్ దాడుల వల్ల సుమారు 179 మంది పౌరులు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని రక్షించడానికి ఇతర దేశాలు కూడా యుద్ధనౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధం ముదురుతుండటంతో మధ్యప్రాచ్యంలో గ్యాస్, ఆయిల్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Follow Us