/rtv/media/media_files/2026/06/08/chagos-archipelago-2026-06-08-12-51-24.jpg)
Chagos Archipelago
Chagos Archipelago : ఇరాన్ సంక్షోభం,పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య హిందూ మహాసముద్రంలోని ఒక వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా కన్నుపడింది. మారిషస్ సమీపంలో ఉన్న 'చాగోస్ దీవుల సమూహాన్ని' (Chagos Archipelago) కొనుగోలు చేయడానికి అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. ఈ చాగోస్ దీవుల్లోనే అమెరికా-బ్రిటన్‌లకు చెందిన అత్యంత కీలకమైన 'డియాగో గార్సియా' సైనిక విమానాశ్రయం (Military Airbase) ఉంది. ఈ ప్రాంతాన్ని తన పూర్తి నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని 'ది టెలిగ్రాఫ్' నివేదిక వెల్లడించింది.
పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య ఘర్షణ మళ్లీ రాజుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారించినప్పటికీ, ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, పశ్చిమ ఆసియాతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిఘా ఉంచడానికి అమెరికాకు ఒక బలమైన స్థావరం అవసరమైంది. ప్రస్తుతం చాగోస్ దీవులు బ్రిటన్ ఆధీనంలో ఉన్నప్పటికీ, ఒక ఒప్పందం ప్రకారం వీటి సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బదిలీ చేయడానికి బ్రిటన్ అంగీకరించింది. అయితే బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు నచ్చలేదు. అందువల్ల మారిషస్‌తో నేరుగా మాట్లాడి ఈ దీవులను కొనుగోలు చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది. పశ్చిమ ఆసియాలో సుదూర ప్రాంతాల సైనిక చర్యల కోసం ఉపయోగించే డియాగో గార్సియా భవిష్యత్తుపై అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
బ్రిటన్ ప్రణాళిక ప్రకారం.. చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బదిలీ చేసి, 'డియాగో గార్సియా' సైనిక స్థావరాన్ని మాత్రం సుదీర్ఘకాలం పాటు లీజుకు తన వద్దే ఉంచుకోవాలని అనుకుంది. కానీ, మారిషస్‌కు చైనా ఇరాన్‌లతో ఉన్న దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. సార్వభౌమాధికారం మారిషస్ చేతుల్లోకి వెళ్తే, వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన ఈ సైనిక స్థావరం చుట్టూ శత్రుదేశాల నిఘా పెరిగే ప్రమాదం ఉందని అమెరికా సీనియర్ అధికారులు భయపడుతున్నారు. డియాగో గార్సియా అనేది అంతర్జాతీయంగా అమెరికా శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి, సుదూర బాంబర్ మిషన్లు, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి అత్యంత కీలకమైన కేంద్రం.
చాగోస్ దీవులపై బ్రిటన్ సార్వభౌమాధికారాన్ని మారిషస్ చాలా కాలంగా అంతర్జాతీయ వేదికలపై సవాలు చేస్తోంది. ఈ దౌత్య వివాదానికి ముగింపు పలకడానికే బ్రిటన్ ఈ బదిలీ ఒప్పందాన్ని సిద్ధం చేసింది. అయితే, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం ఆలస్యమవుతోంది. వాషింగ్టన్ (అమెరికా) ఆమోదం తెలిపితేనే తాము ఈ బదిలీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని బ్రిటన్ స్పష్టం చేసింది. దీన్ని బట్టి అమెరికా అంగీకారం లభిస్తే తప్ప బ్రిటన్-మారిషస్ మధ్య ఎలాంటి ఒప్పందమూ సాధ్యం కాదని స్పష్టమవుతోంది.
చాగోస్ దీవుల నేపథ్యం
చాగోస్ ద్వీపసమూహం అనేది 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 58 చిన్న దీవుల సమూహం. ఇది మారిషస్ ప్రధాన ద్వీపానికి ఈశాన్యంగా దాదాపు 2,200 కిలోమీటర్ల దూరంలో, భారత దేశంలోని తిరువనంతపురానికి నైరుతి దిశలో సుమారు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. మారిషస్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 18వ శతాబ్దం నుండి చాగోస్ దీవులు మారిషస్ రిపబ్లిక్‌లో భాగంగా ఉన్నాయి. అప్పట్లో ఇది ఫ్రెంచ్ వలసరాజ్యంగా ఉండేది. 1810లో ఫ్రాన్స్ ఈ దీవులను బ్రిటన్‌కు అప్పగించింది. ఆ తర్వాతే దీని పేరు మారిషస్‌గా మారింది. బ్రిటిష్ పాలన కాలమంతా చాగోస్ దీవుల పరిపాలన మారిషస్ పరిధిలోనే సాగింది. అయితే, 1965లో మారిషస్ నుండి దీనిని చట్టవిరుద్ధంగా వేరు చేసి, బ్రిటన్ తన ఆధీనంలోకి తీసుకుంది.
ఐక్యరాజ్యసమితి తీర్మానం
మారిషస్ ఈ అంశాన్ని వివిధ అంతర్జాతీయ వేదికలపై నిరంతరం లేవనెత్తుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2019లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అందులో "చాగోస్ ద్వీపసమూహం మారిషస్‌లో అంతర్భాగం" అని స్పష్టం చేస్తూ, ఆరు నెలల వ్యవధిలో బ్రిటన్ తన వలస పాలనను అక్కడ నుండి బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ తీర్మానం ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మరోవైపు, చాగోస్ విషయంలో మారిషస్ డిమాండ్‌కు భారతదేశం కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. 2024లో మారిషస్ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. వలసవాద నిర్మూలన, దేశాల సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండే భారతదేశ ప్రధాన విధానానికి అనుగుణంగా, చాగోస్ అంశంలో మారిషస్‌కు భారతదేశం నిరంతరం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
Follow Us