Bhanumathi: భారత చలనచిత్ర చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ భానుమతి

అలనాటి హీరోయిన్ డాక్టర్‌. భానుమతి ధైర్యానికి మారుపేరు. గాంభీర్యంగా కనిపించే ఆమె ఎంతో హుందాతనంగా వ్యవహరించేవారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లోని అగ్రహీరోల సరసన నటించిన గొప్ప నటి. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి దక్షిణ నటి. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓసారి భానుమతిని స్మరించుకుందాం.

New Update
Bhanumathi: భారత చలనచిత్ర చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ భానుమతి

Bhanumathi: సెప్టెంబర్ 7, 1925వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో పలివాయి భానుమతి జన్మించారు. 13వ ఏట అయిష్టంగానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. అనతికాలంలోనే నెంబర్ 1 హీరోయిన్‌గా ఎదిగారు. అగ్రహీరోలతో సమానంగా పారితోషికం అందుకునే వారు. 1940-50వ దశకాల్లో 10గ్రాముల బంగారం ధర రూ.90గా ఉండేది. అలాంటి రోజుల్లో ఆమె ఒక్క సినిమాకు రూ.25వేలు తీసుకునేవారంటే భానుమతి రేంజ్ ఏస్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన నటిగా పేరు దక్కించుకున్నారు. ఆమె పారితోషికమే సినిమా బడ్జెట్‌లో సగం ఉండేది. ఈ రికార్డు నేటికీ పదిలంగానే ఉందని చెప్పుకోవచ్చు. 60ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భానుమతి 100కు పైగా సినిమాల్లో నటించారు.

publive-image

13వ ఏట సినిమాల్లోకి ప్రవేశం.. 

తన 13వ ఏట 1939లో సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 'వరవిక్రయం' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అయితే ఆమె తండ్రి పెట్టిన ఎన్నో షరతులకు పుల్లయ్య ఒప్పుకోవడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కాళింది పాత్రలో ఆమె నటించారు. 1940లో ‘మాలతీ మాధవం’ చిత్రంలో నటించారు. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తన నటన, హావభావాలతో అగ్రనటిగా పేరు దక్కించుకున్నారు. ఎన్టీ రామారావు, శివాజీ గణేశన్, M. G. రామచంద్రన్, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు. మల్లీశ్వరి, బాటసారి మరియు అంతస్తులు, కృష్ణప్రేమ, స్వర్గసీమ, చక్రపాణి, లైలా మజ్ను, విప్రనారాయణ వంటి గొప్ప చిత్రాల్లో ఆమె నటన ఇప్పటికీ గుర్తిండిపోతుంది.

publive-image

అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి..

1943 ఆగస్టు 8న కృష్ణప్రేమ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రామకృష్ణను ఆమె ప్రేమించి 20ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారి కుమారుడు భరణి పేరు మీద నిర్మాణ సంస్థ, స్టూడియో ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించేవారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే చలనచిత్ర పరిశ్రమలో వారికి ధీటుగా నిలబడి ఆనాటి మూస పద్ధతులను బద్దలు కొట్టిన టార్చ్‌బేరర్‌గా పేరు పొందారు. భానుమతి అంటే గాంభీర్యంతో పాటు ధైర్యంగా ఉండటంతో ఆమె అంటే భయపడేవారు. కానీ ఆమె వ్యక్తిత్వం మాత్రం ఎంతో మంచిగా ఉండేది.

publive-image

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి.. 

1953లో చండీరాణి చిత్రానికి దర్శకురాలుగా పనిచేశారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో మొదటి మహిళా దర్శకురాలుగా నిలిచారు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో నిర్మించబడింది. అంతేకాదు ఆమె ఐదు చిత్రాలకు సంగీతం కూడా అందించారు. తన స్వరంతో ఎన్నో పాటలు పాడారు. రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేశారు. కథానాయిక పాత్ర నుంచి బామ్మ పాత్ర వరకూ ఏ పాత్ర పోషించినా తన ప్రత్యేకత కనబరిచేవారు భానుమతి. చివరగా 1998లో వచ్చిన ‘పెళ్లికానుక’ చిత్రంలో ఆమె నటించారు.

publive-image

పద్మశ్రీ అందుకున్న తొలి దక్షిణ భారత నటి..

1966లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి దక్షిణ భారత నటి భానుమతి. 2001లో పద్మభూషణ్ అందుకున్నారు. అలాగే నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, తొమ్మిది నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నారు. 1999లో 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆమె ప్రత్యేక గౌరవించబడ్డారు. 2013లో ఆమె చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను తపాలా శాఖ విడుదల చేసింది. అనారోగ్యంతో 80 ఏళ్ల వయసులో 24 డిసెంబర్ 2005న ఆమె చెన్నైలో కన్నుమూశారు.

ఇది కూడా చదవండి: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు