అలా జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..! ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో 50 శాతం మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

New Update
అలా జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..! ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

మెజార్టీ తగ్గితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సవాల్ చేశారు. కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, హజూర్‌ నగర్‌ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ, హజూర్‌ నగర్‌ నియోజకవర్గాల విద్యార్థి, యువజన సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, యూత్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తాము పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో 50 శాతం కంటే అదిక మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. 50 శాతం కంటే మెజార్టీ తగ్గితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్‌ చేశారు.

తమకు పిల్లలు లేరన్న ఆయన.. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే తమ పిల్లలుగా పని చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ వేయకుండా అభ్యర్థులను విసిగించారని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీల్లో ప్రస్తుతం 2 వేల టీచర్‌ పోస్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన.. వాటిని ఇంత వరకు భర్తీ చేయలేదని మండిపడ్డారు.

మరో 45 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయన్న ఉత్తమ్‌.. సర్వేలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. సంవత్సరానికి రెండు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ప్రకటిస్తామని హామి ఇచ్చారు. కేసీఆర్‌ నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఎంపీ జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు