Maoists In India : నెత్తుటి చరిత్ర.! మావోయిస్టుల ఉద్యమాలు ఎక్కడ నీరుగారిపోతున్నాయి? ఆపద వస్తే అడవీ నుంచి అన్నలు వస్తారని ఎదురుచూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికీ ఉంది. భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు, గిరిజన భూముల రక్షణకు ప్రభుత్వంపై మావోయిస్టులు చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. అసలు మావోయిస్టులు ఎవరు? అనే విషయాల కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 23 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Maoists In India : ఆపద వస్తే అడవీ నుంచి అన్నలు వస్తారని ఎదురుచూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికీ ఉంది. భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు, గిరిజన భూముల రక్షణకు ప్రభుత్వంపై మావోయిస్టు(Maoists) లు చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్ని పక్కదారి పట్టి ఏళ్లు గడుస్తున్నాయి. పోలీసులపై యుద్ధంతో మావోయిస్టులు, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసుల పరస్పర దాడులతో పచ్చని అడవులు(Forest) ఎరుపెక్కిన సందర్భాలకు లెక్కే లేదు. ఈ రెండు వర్గాల ఘర్షణలో ప్రజా సమస్యలు నీరుగారిపోయాయి.. ఓవైపు మావోయిస్టులు ఉనికి ప్రశ్నార్థాకంగా మారిపోయిన రోజులివి.. మరో ఐదేళ్లలో దేశాన్ని మావోయిస్టుల రహితంగా చేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) చెబుతోంది. ఇటు వరుస ఎన్‌కౌంటర్లలో దండకార్యణం నిత్యం దద్దరిల్లుతోంది. ఇంతకీ అసలు మావోయిస్టులు ఎవరు? ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నారు? మావోయిస్టులు నక్సలైట్లు ఒకటేనా? మావోయిస్టులపై ఆనాడు ఎన్టీఆర్(NTR) ఏం చెప్పారు? చంద్రబాబు(Chandrababu) గతంలో ఏం చేశారు? మావోయిస్టులతో వైఎస్సార్ చర్చలు ఎందుకు జరిపారు? మావోయిస్టుల భవిష్యత్ ఏంటి లాంటి విషయాలను ఇవాళ తెలుసుకుందాం! నిజాం నియంతృత్వపు పాలన నుంచి తెలంగాణ(Telangana) ప్రజలు విముక్తి కోసం, భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం, వెట్టిచాకిరి విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడినవారున్నారు. అంటే 1950 నాటికే దేశంలో మావో ఐడియాలజీ వ్యాప్తిలో ఉంది. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాడే మావో. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టులు భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత సంస్థ. చాలా మంది మావోయిస్టులు, నక్సెల్స్ ఒకటేనని అనుకుంటారు. నిజానికి ఇవి రెండు వేరు వేరు. 1967లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి 'నక్సల్' అనే పదం వచ్చింది. వీళ్లంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ ఐడియాలజీను అనుసరిస్తారు. అదే సమయంలో మావో, లెనిన్ సిద్ధాంతాలను కూడా ఫాలో అవుతారు. ఇక దేశంలో కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ కాలం నుంచే ఉంది. కాన్పూర్‌లో డిసెంబర్ 26, 1925న CPIని MN రాయ్ , అబానీ ముఖర్జీ , ఎవెలిన్ ట్రెంట్ స్థాపించారు. అయితే ఈ సీపీఐ అనేక చీలికలకు గురైంది. సీపీఐ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- మార్క్సిస్ట్ 1964లో పుట్టింది. ఈ సీపీఐ(M) నుంచి సీపీఐ(M-L) లాంటి పార్టీలు పుట్టాయి. ఈ పార్టీలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా, భారత్ రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీని నడిపిస్తూ ఎన్నికల్లో పోటి చేస్తాయి. అటు మావోయిస్టులు ప్రజావ్యతిరేక విధానాలపై హింసా మార్గాంలో ప్రభుత్వాలతో తలపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే మావోయిజం అనేది విప్లవాన్ని సాధించడానికి జరిగే ఓ సామూహిక సమీకరణ. సాయుధ తిరుగుబాటును విశ్వసించే ఓ ఆలోచన. ఇక మావోయిస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంలది ఒక్కొక్కరిది ఒక్కో వైఖరి. 1982లో ఎన్‌టీఆర్ మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించారు. 1989లో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా మావోయిస్టును దేశభక్తులగా చెప్పారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు వైఖరి ఎన్‌టీఆర్, చెన్నారెడ్డిలకు పూర్తిగా భిన్నం. ఆయన మావోయిస్టుల గ్రూపులను నిషేధించారు. వారిపై యుద్ధమే ప్రకటించారు. చంద్రబాబు హయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ను మావోయిస్టులు పెల్చడం దేశవ్యాప్తంగా నాడు పెను ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో ఏకంగా చర్చలు జరిపారు. అయితే అవి విఫలయ్యాయి. అటు నిషేధిత సంస్థ అయినా మావోయిస్టులలో రిక్రూట్‌మెంట్లు పెరగాడానికి చాలా కారణాలు ఉన్నాయంటారు విశ్లేషకులు. 1990లల్లో ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల తర్వాత పలు మల్టీనేషనెల్ కంపెనీలు దేశంలోని చాలా ప్రాంతాల్లో తిష్ఠ వేశాయి. గనుల పేరిట, కర్మాగారాల పేరిట, విద్యుత్‌ప్లాంట్ల పేరిట జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో ప్రాబల్యశక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది. పనులు మొదలైన ప్రతిచోటా ప్రతిఘటనా పోరాటాలు చేపట్టింది. కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు చేసింది. అయితే పీడిత ప్రజల విముక్తి కోసం మావోయిస్టుల పట్టిన ఉద్యమ బాట పక్కదారి పట్టడం మొదలైన తర్వాత క్రమక్రమంగా కొన్ని వర్గాల్లో వారిపై నమ్మకం సన్నగిల్లడం ప్రారంభమైంది. ఎందుకంటే మావోయిస్టుల దాడుల్లో చనిపోయిన వారి పేదల సంఖ్య ఎక్కువగా ఉందన్న ప్రచారముంది. పోలీసులపై సాగించే యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోలీసు ఇన్‌ఫార్మర్లగా అనుమానిస్తూ మావోయిస్టుల చంపిన వారిలో 90 శాతం మంది పేదలు, అణగారిన, శ్రామిక వర్గాలకు చెందినవారే ఉన్నారని పలు సంస్థల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజం కాదంటారు మావోయిస్టులు. ప్రభుత్వాలు పలు సంస్థల చేత తప్పుడు లెక్కలు చిత్రికరిస్తుంటాయని చెబుతారు. మావోయిస్టులు, పోలీసులు మధ్య జరిగే పోరులో వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అందులో పోలీసులు, మావోయిస్టులతో పాటు సామాన్యులూ ఉంటారు. ఈ రక్తపాతం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2024లో ఛత్తీస్‌గఢ్ అడవుల కేంద్రంగా అనేక కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది. మరోవైపు మావోయిస్టులు లేని దేశంగా ఇండియాను మారుస్తామని హోంమంత్రి అమిత్‌షా అంటున్నారు. 2009 -2021 మధ్య దేశంలో మావోయిస్టు హింసాత్మక ఘటనలు 77శాతం తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. Also Read: Urinary Infection: పురుషులలో యూరిన్ ఇన్ఫెక్షన్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..! #telangana #chandrababu #ntr #maoists-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి