Israel:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు

ఇజ్రాయెల్ మీద రసాయన ఆయుధాల దాడులకు హమాస్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు.

New Update
Israel:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు

హమాస్ అన్నిరకాలుగా యుద్ధానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రూఫ్ లు కూడా మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గో. తమ సైన్యం దాడి చేసినప్పుడు ఒక హమాసం మిలిటెంట్ చనిపోయాడని అతని దగ్గర రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు. సాయుధుడి మృతదేహం దగ్గర సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికిందన్నారు. దీన్ని వాళ్ళు ఉగ్రసంస్థ అల్‌ ఖైదా నుంచి పొందినట్లు ఐజాక్ ఆరోపించారు. మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్‌ సభ్యుల దగ్గర దొరికాయన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

మరోవైపు హెజ్బొల్లా యుద్ధంలోకి వస్తే లెబనాన్‌ విధ్వంసాన్ని చవిచూడక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాము చేసే దాడులు ఊహించని విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. లెబనాన్‌ సరిహద్దుల్లోని కమాండోలతో నెతన్యాహు మాట్లాడారు. సరిహద్దుల్లో పరిస్థితులను సైనికులను అడిగి తెలుసుకున్నారు. అదనపు బలగాల మోహరింపు, ఆయుధాల పరిస్థితిపై ఆరా తీశారు. గాజా యుద్ధంలోకి హెజ్బొల్లా పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని నెతన్యాహు తెలిపారు. ఒక వేళ వాళ్ళు కనుక రంగంలోకి దిగితే ఇజ్రాయల్ కు చావోరేవో అవుతుందన్నారు. గాజా సరిహద్దులో సిద్ధంగా ఉన్న సైన్యం భూతల దాడులపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి భూతల దాడులపై చర్చించారు.

Also Read:కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్

ఇక ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. గాజా, వెస్ట్‌బ్యాంకుతో పాటు పొరుగు దేశం సిరియాపైనా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. లెబనాన్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ రోజూ దాడులు చేస్తోంది. ఇప్పటిదాకా గాజా, లెబనాన్‌కే పరిమితమైన దాడులు సిరియాకు కూడా విస్తరించడంతో యుద్ధంలోకి పొరుగు దేశాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.మిలిటెంట్లు ఉన్నారన్న కారణంతో గాజా వెస్ట్‌బ్యాంక్‌లోని మసీదుపైనా బాంబు దాడులు చేసింది. సిరియాలోని రెండు విమానాశ్రయాలపై బాంబులు ప్రయోగించింది.

పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయగా..30 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. శరణార్థుల క్యాంప్‌ ఉన్న చోటే ఈ దాడి జరిగింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 266 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా హెల్త్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 117 మంది చిన్నారులే ఉన్నారు. అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఇజ్రాయెల్‌ దాడుల్లో 4,600 మంది మృతి చెందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు