Guntur Kaaram Review: ఫ్యాన్స్ కి పండగ జాతరే.. కానీ.. గుంటూరు కారం ఘాటు ఎలా ఉందంటే.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా ఉంది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.  

New Update
Guntur Kaaram Review: ఫ్యాన్స్ కి పండగ జాతరే.. కానీ.. గుంటూరు కారం ఘాటు ఎలా ఉందంటే.. 

Guntur Kaaram Review: కొన్ని సినిమాలు ఫ్యాన్స్ కోసమే అనిపిస్తుంది. దర్శకులు కూడా హీరో ఫ్యాన్స్ కోసమే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి సినిమా పెద్ద పండక్కి వస్తే.. అది కూడా మహేష్ బాబు సినిమా అయితే.. అది గుంటూరు కారంలా ఉంటుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబోలో వస్తున్న మూడో సినిమా అనేసరికి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు.. పండగ కావడం.. టీజర్లు.. సాంగ్స్ తో కుర్చీలు మడతపెట్టించే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయనే హైప్ రావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా గుంటూరు కారం సినిమా చూడడానికి ఆరాటపడ్డారు. మరి సినిమా ఈరోజు జనవరి 12న విడుదలైంది. మరి త్రివిక్రమ్ అతడు లోని ఖలేజాను వెండితెరమీద హ్యాట్రిక్ దిశలో నడిపించాడా చెప్పేసుకుందాం.. 

గుంటూరు కారం(Guntur Kaaram Review) పేరుకు తగ్గట్టుగానే మాస్ మసాలా సినిమా. తల్లి.. కొడుకుల సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలను కలగలిపి అల్లుకున్న కథ ఇది. చిన్నప్పుడే తల్లి వదిలి పెట్టి వెళ్ళిపోతుంది.. తండ్రి జైలుకు వెళతాడు.. తిరిగి వచ్చాకా ఒక గదిలో ఉండిపోతాడు.. తల్లి ఎందుకు వదిలి పెట్టి వెల్లిందో ఆ కొడుకుకు తెలీదు. తండ్రి ఎందుకు గది దాటి రావడం లేదనే విషయం అర్ధం కాదు.. మిగిలిన బంధువుల మధ్యలో పోకిరీల పెరుగుతాడు. కానీ, తల్లిని చూడాలని.. తనను ఎందుకు వదిలేసి వెళ్లిపోయిందో తెలుసుకోవాలనీ ప్రయత్నం చేస్తాడు. ఈలోపు తల్లి చుట్టూ ఉన్న ఒక రాజకీయ విషవలయం గురించి తెలుస్తుంది. దాని నుంచి ఎలా తల్లిని బయటకు తీసుకువెళ్లాడు అనేది కథ(Guntur Kaaram Review). కథ లైన్ బావుంది. ఇలాంటి లైన్ కి త్రివిక్రమ్ దర్శకుడు అయితే.. మాటల తూటాలు.. గుండెను పిండేసే ఎమోషన్స్ అన్నీ కచ్చితంగా ఉంటాయి. దీనికి మహేష్ బాబు హీరో అంటే వేరే లెవెల్ లో సినిమా ఉండాలి. 

అందరూ అనుకునేది ఇదే. కానీ.. మంచి ఫ్యామిలీ స్టోరీకి మాస్ మసాలా మిక్స్(Guntur Kaaram Review) చేయాలని ప్రయత్నించడమే  కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ కి కారం ఘాటులా అనిపిస్తుంది. కారం సరిగ్గా వేస్తే.. వంటకానికి వచ్చే ఘుమ ఘుమ వేరు. సినిమాకీ అంతే.. మాస్ మసాలా సరిగ్గా వేస్తే అది ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. కాస్త ఘాటు ఎక్కువ చేద్దాం అని చూస్తే అది గొంతు దిగడానికి మంట పుట్టిస్తుంది. సరిగ్గా అదే అనిపిస్తుంది గుంటూరు కారం చూస్తే. కథగా చెప్పుకోవడానికి చక్కగా ఉన్నా.. మహేష్ బాబులాంటి హీరో ఉన్నా… మాస్ మసాలా ఘాటు ఎక్కువ అనిపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి పట్టుకునే అవకాశం లేదు. ఫ్యాన్స్ కోణం నుంచి చూస్తే మాత్రం త్రివిక్రమ్ మహేష్ బాబుని(Guntur Kaaram Review) సూపర్ గా ఎలివేట్ చేశాడని చెప్పుకోవచ్చు. 

Also Read: కొత్త ఆవకాయలా ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ హీరో హను-మాన్!

ఒక ఫ్యాన్ గా మాట్లాడాలి అంటే.. మహేష్ బాబు ఇరగదీశాడు. లుక్ దగ్గర నుంచి డైలాగ్ డిక్షన్ వరకూ డిఫరెంట్ గా చేశాడు. మాస్ ఎలివేషన్స్ లో.. సెంటిమెంట్ సీన్స్ లో(Guntur Kaaram Review) ప్రతి చోటా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్.. కామెడీ టైమింగ్.. ఎమోషన్స్ అన్నిటి లోనూ కొత్త మహేష్ బాబు కనిపించాడు. ఇక కీలకమైన తల్లి పాత్రలో రమ్యకృష్ణ గురించి చెప్పక్కర్లేదు. కనిపించిన ప్రతి సీన్ లోనూ అందరినీ కదిలించింది. సినిమా అంతా కనిపించిన వెన్నెల కిషోర్ తన టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. శ్రీలీల ఎనర్జీ లెవెల్స్ వేరే. ముఖ్యంగా పాటల్లో అసలు మాస్ కాదు.. ఊర మాస్ స్టెప్స్ అదరగొట్టేసింది. అది చూసే మహేష్ బాబుతో ప్రత్యేకంగా ఒక డైలాగ్ కూడా చెప్పించారు. ఏమి స్పీడ్.. నేను మ్యాచ్ చేయలేకపోతున్నాను అంటూ.. ఇక ఆమెకు పెద్దగా చేయడానికి ఏమీ లేదు. ఇక మీనాక్షి చౌదరి తన పరిధిలో అందంగా చేసింది(Guntur Kaaram Review). సినిమాలో అంతా పెద్ద స్టార్ కాస్టింగ్.. అందరి సీన్స్ దేనికి అవే బావున్నాయి. వాళ్ళు కూడా తమకు వచ్చిన అవకాశం మేరకు బాగా చేశారు. 

Guntur Kaaram Review: టెక్నీకల్ గా చెప్పుకోవాలంటే.. పీఎస్ వినోద్ ఫోటో గ్రఫీ క్లీన్ గా ఉంది. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే, మాస్ సినిమాలు అంటేనే తమన్ ఒక రేంజిలో రెచ్చిపోతాడు. ఇందులోనూ అదే చేశాడు. నవీన్ నూలి ఎడిటింగ్  బావుంది.. అక్కడక్కడా లాగ్ ఉన్నా.. అది అతని తప్పు కాదనిపిస్తుంది. 

మొత్తంగా చూసుకుంటే, గుంటూరు కారం సినిమా ఫ్యాన్స్ మెచ్చే.. వారికి  నచ్చే సినిమా అని చెప్పవచ్చు. పండక్కి మంచి మాస్ మసాలా సినిమా కావాలంటే గుంటూరు కారం ప్రిఫర్ చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రివిక్రమ్.. మహేష్ బాబుల కాంబో కాస్త ఘాటుగానే ఉంది. 

- KVD వర్మ

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు