కొత్త పార్లమెంట్‌ భవనానికి 'ఏఐ'తో రక్షణ.. మాములుగా ఉండదు మరి!

అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్‌ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. పార్లమెంట్ భవనం ఎంట్రీ వద్ద అధునాతన ఫేషియల్ 'ఏఐ' మెకానిజమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక 'స్మార్ట్ కార్డ్' ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అప్లికేషన్స్‌ని కూడా ఉపయోగించుకోబోతోంది ప్రభుత్వం. ఈ కార్డు ఉన్న వాళ్లు మాత్రమే బిల్డింగ్‌లోని నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లగలరు.

New Update
కొత్త పార్లమెంట్‌ భవనానికి 'ఏఐ'తో రక్షణ.. మాములుగా ఉండదు మరి!

కొంతకాలం పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లేకుండా ఏ పని జరగని పరిస్థితి వస్తుందేమో.. ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయో.. ముందుముందు ఏఐ(AI) కూడా అంతే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలనుకుంటోంది. కొత్త పార్లమెంట్‌ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. ఇక ఈ కొత్త భవనం నిర్మాణ నైపుణ్యంలోనే కాదు, ప్రజాస్వామ్య పురోగతికి దర్పణంగా నిలుస్తుందని దేశం మొత్తం కీర్తిస్తున్న వేళ కొత్తగా 'ఏఐ'ను కూడా బిల్డింగ్‌లో భాగం చేయడం మెచ్చుకొదగ్గ విషయమేనంటున్నారు విశ్లేషకులు.

'ఏఐ'తో రక్షణ ఎలా?
కొత్త పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించడానికి అధునాతన ఫేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ గేట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్‌తో పాటు స్కానింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు(MPs) ఉన్నతాధికారులను 'ఏఐ' ముందుగానే గుర్తుపట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. కొత్త పార్లమెంట్‌ భవనానికి ప్రవేశ ద్వారం నుంచి ఆరు మీటర్ల దూరంలోకి వీరిలో ఎవరు వచ్చినా వెంటనే గేట్లు తెరుచుకుంటాయి. ఒకవేళ షేషియల్ సిస్టమ్‌ ఫెయిల్ అయితే థంబ్‌ లేదా ఇతర పద్ధతుల్లో ఎంపీలను లోపలికి అనుమతిస్తారు.

ఇతర విశేషాలు ఏంటి?
స్మార్ట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌ల లాగానే.. స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అప్లికేషన్స్ (SCOSTA)ని ఉపయోగించనున్నారు. పార్లమెంట్‌ భవనంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు అందరికి అనుమతి ఉండదు.. ఆ ప్రాంతాలకు వెళ్లడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరి. అలా క్లియరెన్స్‌ తెచ్చుకున్న వాళ్లకి ఒక కార్డ్ ఇస్తారు. వారిని మాత్రమే అనుమతించేలా ఆ కార్డులో 'ఏఐ'ని ప్రోగ్రామ్ చేశారు. ఈ ఎన్‌క్రిప్టెడ్ డేటా ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.

పార్లమెంట్‌ లాబీ, ఇతర కారిడార్లలో మీడియాకు ప్రవేశం ఉంటుంది. పదేళ్లకు పైగా రిపోర్టింగ్ అనుభవం ఉన్నవారు సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించవచ్చు. కొత్త సిస్టమ్‌ ప్రకారం.. మీడియా కార్డ్‌ ఉంటే నార్త్ యుటిలిటీ బిల్డింగ్‌ పరిసర ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఇందులో క్యాంటీన్, రూమ్‌ సౌకర్యం ఉంటుంది. అయితే.. ప్రధాన(main) పార్లమెంట్ భవనంలో మాత్రం మీడియాకు సిట్టింగ్ ఏరియాతో పాటు మరొక క్యాంటీన్‌కు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక గత మే 28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే ప్రస్తుతం కార్యకలాపాలు పాత బిల్డింగ్‌లోనే జరుగున్నాయి. రానున్న జీ20 దేశాల సమావేశాల టైమ్‌కి కొత్త కొత్త భవనం పూర్తిగా రెడీ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు