/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/godavari.jpg)
Emergency Alert Issued As Godavari Water Rises : రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి.
వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్న గోదావరి, మధ్యాహ్నం 1 గంటకు 39.5 అడుగులకు చేరింది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 40.5 అడుగులకు చేరింది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు 41.03 అడుగులకు చేరడంతో, 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
సాయంత్రం 6 గంటలకు 41.09 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో 8.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదిలిపెట్టారు. సాయంత్రం 8 గంటల వరకు 43.6 అడుగులకు చేరి మొదటి ప్రమాద స్థాయిని దాటి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 9.30 గంటలకు 44.4 అడుగులకు చేరుకుంది.
దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బల మంగి వాగు, సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది.
గోదావరి (Godavari) దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు.