Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. కాశ్మీర్‌ ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.

New Update
Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

Elections In Three States : కేంద్ర ఎన్నికల సంఘం (CEC).. మరోసారి ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌ (Jammu & Kashmir) లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిపేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశంలో అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఆగస్టు 20 వ తేదీ నాటికి.. ఓటర్ల జాబితాలో సవరణ ప్రక్రియను పూర్తి చేసి.. తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఆ 3 రాష్ట్రాలతోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇక ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తాజాగా ఈసీ తెలిపింది. జులై 1 వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తేల్చి చెప్పింది. జులై 25 వ తేదీన ఓటర్ల (Voters) ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని.. ఆగస్టు 9 వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించింది. ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 20 వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

హర్యానా (Haryana) అసెంబ్లీ గడువు నవంబర్‌ 11 వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ గడువు నవంబర్‌ 26 వ తేదీన.. జార్ఖండ్‌ (Jharkhand) అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5 వ తేదీతో పూర్తి కానుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నింటికీ వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎన్నికలు జరగనున్న ఈ 4 రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజుల్లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

2018 లో జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ రద్దయింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరగ్గా.. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌ ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్త్రృతం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్‌లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించింది.

Also Read:BJP: బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా నడ్డా!

Advertisment
Advertisment
తాజా కథనాలు